ABP  WhatsApp

Sharad Pawar: కాంగ్రెస్‌తో కలిసేందుకు దీదీ రెడీ- శరద్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు

ABP Desam Updated at: 22 Sep 2022 11:21 AM (IST)
Edited By: Murali Krishna

Sharad Pawar: 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందే బలమైన ప్రతిపక్ష కూటమి ఏర్పడుతుందని ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు.

కాంగ్రెస్‌తో కలిసేందుకు దీదీ రెడీ- శరద్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు

NEXT PREV

Sharad Pawar: 2024 సార్వత్రిక ఎన్నికల గురించి ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందే ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఓ బలమైన కూటమిని ఏర్పాటు చేస్తాయని పవార్ అన్నారు. ఇందుకోసం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ.. కాంగ్రెస్‌తో కలవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.



జాతి ప్రయోజనాల కోసం బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. కాంగ్రెస్‌ పార్టీతో తనకున్న విభేదాలను పక్కన పెట్టి చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నారు. బంగాల్‌ ఎన్నికల నాటి సంఘటనలను విస్మరించాలని ఆమె అనుకుంటున్నారు. బంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు ఎక్కువ సీట్లు రావడానికి కాంగ్రెస్‌, సీపీఎం నేతృత్వంలోని కూటమి ఉపయోగపడిందని మమత భావిస్తున్నారు. అయితే అవేవీ పట్టించుకోకూడదని మమత అనుకుంటున్నారు. జాతీయ స్థాయిలో భాజపాకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ను కలుపుకొని వెళ్లేందుకు చాలా పార్టీలు సుముఖంగా ఉన్నాయి.                                                              -  శరద్ పవార్, ఎన్‌సీపీ అధినేత


నితీశ్ కూడా


మరోవైపు బిహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా కాంగ్రెస్‌తో జట్టుకట్టడానికి సిద్ధంగా ఉన్నారని పవార్ అన్నారు. 



భాజపాకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో జట్టు కట్టడానికి బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్, జమ్ము కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లాకి కూడా అభ్యంతరాలు లేవు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను ఎదుర్కోవడానికి విపక్షాలు అంతా సిద్ధంగా ఉన్నాయి.                                               -  శరద్ పవార్, ఎన్‌సీపీ అధినేత


2024లో భాజపాను ఓడించడమే లక్ష్యంగా విపక్షాలు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అయితే, ఇప్పటికీ ప్రతిపక్షాల ఐక్యత ఓ రూపు దాల్చలేదు. కాంగ్రెస్‌తో కలిస్తేనే భాజపాను ఓడించగలమని కొన్ని పార్టీలు చెబుతున్నాయి. మరి కొన్ని కాంగ్రెస్‌ లేకుండా ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి.


లాలూ


రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జేడీ) చీఫ్, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. 2024లో భాజపాను గద్దె దించుతామని ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం త్వరలోనే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలుస్తానన్నారు. ఈ మేరకు ఆర్‌జేడీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో లాలూ అన్నారు.


Also Read: Lalu Prasad VS BJP: 'త్వరలోనే సోనియా, రాహుల్‌ను కలుస్తాం- 2024లో భాజపాను గద్దె దించుతాం'


Also Read: National Logistics Policy: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు- ఆ పాలసీకి ఆమోదం!

Published at: 22 Sep 2022 11:12 AM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.