National Logistics Policy: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నెల 17న ప్రధాని మోదీ ప్రారంభించిన నేషనల్ లాజిస్టిక్స్ పాలసీని కేబినెట్ ఆమోదించింది. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ వెల్లడించారు.
కేబినెట్ నిర్ణయాలు
- సౌరశక్తి ప్లాంట్ల కోసం కేంద్రం రూ.19,500 కోట్లు మంజూరు చేసింది.
- పీఎల్‌ఐ స్కీమ్ కిందకు సోలార్ ప్యానెళ్లను తెచ్చారు.
- 14 రంగాలకు ప్రోత్సాహం కల్పించేందుకు పీఎల్‌ఐ స్కీమ్ తీసుకొచ్చింది.
- సెమీ కండక్టర్ల అభివృద్ధి కార్యక్రమానికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
లాజిస్టిక్ పాలసీ
నేషనల్ లాజిస్టిక్స్ పాలసీని కేంద్రం ఆమోదించింది. ఈ పాలసీలో భాగంగా 2030 నాటికి టాప్ 25 దేశాల్లో చేరేలా లాజిస్టిక్ ఇండెక్స్ ర్యాంకింగ్ మెరుగుపరుచుకునే చర్యలు చేపడతారు. వస్తువులు దేశవ్యాప్తంగా అంతరాయాలు లేకుండా రవాణా అయ్యే విధంగా చేయడం కోసం ఈ విధానం ఉపయోగపడుతుంది.
కరోనా సంక్షోభంలో బయట తిరగలేని పరిస్థితుల్లో ప్రజలకు వస్తు సేవలు అందుబాటులోకి రావడానికి లాజిస్టిక్స్ రంగం ఎంతగానో ఉపయోగపడిందని కేబినెట్ గుర్తించింది. అంతర్జాతీయ ఈ-కామర్స్ సంస్థలు లాజిస్టిక్ రంగాన్ని వినియోగించుకుని ప్రపంచ వ్యాప్తంగా సేవలందిస్తున్నాయి. దీంతో ఆయా ఉత్పత్తులను దేశ విదేశీ వినియోగదారుల చెంతకు చేర్చడానికి లాజిస్టిక్స్ రంగాన్ని ప్రోత్సహించడం తక్షణావసరమని కేబినెట్ అభిప్రాయపడింది.
పారిశ్రామిక, ఈ-కామర్స్, సేవా రంగాల్లో వృద్ధికి అనుగుణంగా లాజిస్టిక్స్ రంగాన్ని ప్రోత్సహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందులో భాగంగా రూపొందించిన లాజిస్టిక్స్ పాలసీని ఆమోదించింది.
Also Read: Congress President Polls: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మరో ట్విస్ట్- అశోక్ గహ్లోత్ ఏమన్నారంటే?
Also Read: PayCM Posters: 'పేసీఎం' పోస్టర్లు- అవినీతిపై కాంగ్రెస్ వినూత్న నిరసన