King Charles III Coronation: 


నెలల తరావతే పట్టాభిషేకం..? 


క్వీన్ ఎలిజబెత్-II మృతితో బ్రిటన్‌కు రాజుగా కింగ్ చార్లెస్‌-III బాధ్యతలు చేపట్టారు. ఇటీవలే రాణి అంత్యక్రియలు ముగిశాయి. పలు దేశాలు అధినేతలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆమెకు నివాళులర్పించారు. అయితే కింగ్ చార్లెస్-IIIకి అధికారికంగా పట్టాభిషేకం ఇంకా జరగలేదు. ఈ కార్యక్రమం త్వరలోనే జరగనుంది. సాధారణంగా...రాజు లేదా రాణి పట్టాభిషేకం (Coronation) అంటే చాలా ఆర్భాటంగా చేస్తారు. రాచ మర్యాదలతో ఎంతో ఘనంగా జరుగుతుందీ తంతు. 1953లో క్వీన్ ఎలిజబెత్-II పట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. కానీ...ఈ సారి కింగ్ చార్లెస్-III మాత్రం చాలా సాదాసీదాగా ఈ తంతు పూర్తి చేయాలని భావిస్తున్నారట. ఎలాంటి హంగులు లేకుండా, పెద్దగా ఖర్చు పెట్టకుండా దీన్ని ముగించేయాలని చూస్తున్నారట. ప్రస్తుతానికి యూకేలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్న విషయం తెలిసిందే. అందుకే...ఎక్కువగా ఖర్చు పెట్టకుండా సింపుల్‌గా పట్టాభిషేకం జరిగేలా ప్లాన్ చేస్తున్నారు కింగ్ చార్లెస్. యూకే పత్రిక Independent ఇదే విషయాన్ని వెల్లడించింది. ఎప్పుడు ఈ కార్యక్రమం జరగనుందన్నది మాత్రం ఇంకా ప్రకటించలేదు. సెప్టెంబర్ 8వ తేదీన రాణి మరణించగా..అప్పటి నుంచి సంతాప దినాలు పాటిస్తోంది రాయల్ ఫ్యామిలీ. కొన్ని నెలల తరవాతే పట్టాభిషేకం పెట్టుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ అక్కడి ప్రభుత్వం ఈ కార్యక్రమానికి ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవటమూ....ఇప్పట్లో ఈ తంతు లేదన్న సంకేతాలిస్తోంది. వీలైనంత వరకూ తక్కువగా ఖర్చు చేసి, చాలా సాధారణంగా చేయాలని నిర్ణయించుకున్నారు. దేశ ఆర్థిక పరిస్థితులను గమనించే ఈ డిసిషన్ తీసుకున్నారు. వెస్ట్‌మిన్‌స్టర్ అబేలోనే పట్టాభిషేకం నిర్వహిస్తారు. 


ప్రమాణస్వీకారం..


బ్రిటన్‌ రాజకుటుంబ నిబంధనల ప్రకారం రాజు లేదా రాణి మరణిస్తే వారి వారసుడు లేదా వారసురాలిగా మొదటి వరుసలో ఉన్నవారు తక్షణమే బ్రిటన్‌ రాజు/రాణిగా మారిపోతారు. కనుక రాణి ఎలిజబెత్‌ 2 వారసుడిగా మొదటి స్థానంలో ఉన్న పెద్ద కుమారుడు ప్రిన్స్‌ చార్లెస్‌ బ్రిటన్‌ రాజుగా మారతారు. అయితే పట్టాభిషేకానికి నిర్దేశిత లాంఛనాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకు కొన్ని నెలలు లేదా మరింత ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. రాణి మరణించాక 24 గంటల్లోపు కొత్త రాజు పేరును ప్రకటిస్తారు. యాక్సెషన్‌ కౌన్సిల్‌ లండన్‌లోని సెయింట్‌ జేమ్స్‌ ప్యాలెస్‌ నుంచి ఈ అధికారిక ప్రకటన వస్తుంది. పట్టాభిషేక ప్రమాణ చట్టం–1689 ప్రకారం ప్రిన్స్‌ చార్లెస్‌ తన పట్టాభిషేక కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేయాలి. బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ 2 (96) గురువారం తుదిశ్వాస విడిచారు. తీవ్ర అనారోగ్యానికి గురై రాణి ఎలిజబెత్ 2 కన్నుమూసినట్లు వైద్యులు నిర్ధరించారు. ఈ విషయాన్ని బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌ వెల్లడించింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు, సహా యావత్ ఇంగ్లాండ్ శోకసంద్రంలో మునిగిపోయింది. రాణి ఎలిజబెత్‌ను గత ఏడాది అక్టోబర్‌ నుంచే ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. నడవడం, నిలబడడం కూడా ఇబ్బందిగా మారింది. దీంతో అప్పటినుంచి స్కాట్లాండ్‌లోని బాల్మోరల్‌ క్యాజిల్‌లోనే ఆమె ఉంటున్నారు. చివరికి అనారోగ్యంతోనే కన్నుమూశారు. ఇటీవలే రాచరిక మర్యాదలతో ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి.