Bengaluru Viral News: 


రెడిట్‌లో షేర్ చేసిన యూజర్ 


బెంగళూరు ట్రాఫిక్‌ సంగతి ప్రత్యేకంగా చెప్పాలా..? ఇరుకైన రోడ్ల కారణంగా అక్కడి వాహనదారులు నిత్య ఇబ్బందులు పడుతూవే ఉంటారు. ఐటీ హబ్‌గానే ఉన్నప్పటికీ..ఈ సిటీ గురించి ప్రస్తావిస్తే అందరూ ట్రాఫిక్‌ గురించే చెప్పుకుంటారు. ఎన్నో సందర్భాల్లో నెటిజన్లు బెంగళూరు రోడ్లపై అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల వరదల కారణంగా రోడ్లు ఇంకా డ్యామేజ్ అయ్యాయి. ట్రాఫిక్ వల్ల తాము ఎంత ఇబ్బంది పడ్డామో వివరిస్తూ చాలా మంది సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. కానీ...మొట్టమొదటి సారి ట్రాఫిక్ వల్ల ఓ వ్యక్తికి మంచి జరిగిందట. ట్రాఫిక్‌లో ఇరుక్కోవటం వల్ల తన లవ్‌స్టోరీ సక్సెస్ అయిందని ఓ వ్యక్తి చెప్పిన కథ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. నవ్వు కూడా తెప్పిస్తోంది. ట్విటర్‌లో షేర్ చేసిన క్షణాల్లోనే వైరల్ అయిపోయింది ఈ స్టోరీ. ఓ రెడిట్ యూజర్ షేర్ చేసిన స్టోరీని ట్విటర్‌లో ఓ వ్యక్తి పోస్ట్ చేశారు. 






ఆ స్టోరీ ఏంటంటే..? 


"నేను నా గర్ల్‌ఫ్రెండ్‌ని తన ఇంట్లో డ్రాప్ చేసేందుకు బైక్‌పై కూర్చోబెట్టుకుని వెళ్తున్నాను. అప్పుడే ఎజిపుర ఫ్లై ఓవర్ వర్క్ జరుగుతోంది. ట్రాఫిక్‌లో చాలా సేపు ఇరుక్కుపోయాం. చాలా చిరాకేసింది. ఆకలి కూడా వేసింది. దగ్గర్లో ఏమైనా రెస్టారెంట్‌కి వెళ్దామని బైక్‌ని టర్న్ తీసుకు న్నాను. అక్కడే డిన్నర్ చేశాం. ఆ సమయంలోనే మా మధ్య చనువు ఇంకా పెరిగింది. అక్కడి నుంచి కథ మొదలైంది. దాదాపు మూడేళ్ల పాటు ఇద్దరం డేటింగ్ చేశాం. రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాం. కానీ...ఎజిపుర ఫ్లై ఓవర్ పనులు మాత్రం ఇంకా పూర్తి కాలేదు" అని చివర్లో ట్విస్ట్ ఇచ్చాడు ఆ యూజర్. తన కథ చెబుతూనే...అక్కడి పనుల్లో ఎంత జాప్యం జరుగుతోందో చాలా తెలివిగా చెప్పాడన్నమాట. ఓ నెటిజన్ ఆ రెడిట్‌లో పోస్ట్ చేసిన స్టోరీని స్క్రీన్ షాట్ తీసి ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. వేలాది మంది లైక్స్ చేయగా..వందల కామెంట్స్ వచ్చి పడ్డాయి. ఈ లవ్‌స్టోరీని చదివి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న నెటిజన్లు...బెంగళూరు ట్రాఫిక్ కష్టాలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. "ఇది కచ్చితంగా అందరికీ రిలేట్ అయ్యే కథ. నేను బెంగళూరుకు వచ్చినప్పటి నుంచి ఆ పనులు నడుస్తూనే ఉన్నాయి" అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.