IND VS AUS: టీమిండియా కెప్టెన్ గా విరాట్ కోహ్లీ నుంచి పగ్గాలు అందుకున్న రోహిత్ శర్మ.. మొదట్లో జట్టును విజయాల వైపు నడిపించాడు. అయితే ఆసియా కప్ దగ్గర్నుంచి హిట్ మ్యాన్ కు ఏదీ కలిసి రావడం లేదు. ఆసియా కప్ చేజారింది. ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్ మొదటి మ్యాచ్ లో ఓడిపోయింది. అయితే ఈ ఓటముల్లో ఆటగాళ్ల వైఫల్యంతోపాటు కెప్టెన్ గా రోహిత్ శర్మ నిర్ణయాలు కారణమవుతున్నాయి. ఒక్కోసారి హిట్ మ్యాన్ సంయమనం కోల్పోతున్నాడు. ప్రత్యర్థి జట్లు పరుగులు చేస్తున్నప్పుడు అసహనం ప్రదర్శించడం, సహచరులు క్యాచులు వదిలేసినప్పుడు కోప్పడడం.. రోహిత్ ఇలాంటివి చేయడం ఇటీవల తరచుగా జరుగుతోంది. నిన్న ఆసీస్ తో జరిగిన టీ20 మ్యాచులోనూ రోహిత్ ఒకింత అసహనంగానే కనిపించాడు. ఎల్బీడబ్ల్యూ అప్పీల్ విషయంలో కీపర్ దినేశ్ కార్తీక్ పై ఆగ్రహం వ్యక్తంచేశాడు. ఇదంతా సరదాగానే అయినప్పటికీ రోహిత్ ప్రవర్తనపై అభిమానులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. 


అప్పీల్ చేయని కార్తీక్


భారత్ తో నిన్న జరిగిన టీ20 మ్యాచ్ లో ఆసీస్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ సందర్భంగా ఆసక్తికర సంఘటన జరిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ కీపర్ దినేశ్ కార్తీక్ పై ఆగ్రహం వ్యక్తంచేస్తూ అతని గొంతు పట్టుకున్నాడు. ఈ మ్యాచ్ లో రివ్యూల విషయంలో భారత్ మొదట కొంచెం అలసత్వం ప్రదర్శించింది. దాంతో ధాటిగా ఆడుతున్న కామెరూన్ గ్రీన్ కు లైఫ్ లభించింది. చహల్ బౌలింగ్ లో గ్రీన్ స్వీప్ షాట్ కు ప్రయత్నించగా.. అది ప్యాడ్లకు తగిలింది. అయితే బౌలర్ కానీ.. కీపర్ గానీ అప్పీల్ చేయలేదు. అనంతరం రీప్లేలో చూడగా బాల్ వికెట్లకు తగులుతుందని స్పష్టంగా కనిపించింది. దీంతో గ్రీన్ బతికిపోయాడు. 


గట్టిగా అప్పీల్ చెయ్ 
తర్వాత ఉమేశ్ యాదవ్ బౌలింగ్ లో స్టీవ్ స్మిత్ షాట్ కు ప్రయత్నించగా.. బంతి బ్యాట్ ను తాకుతూ కీపర్ కార్తీక్ చేతుల్లో పడింది. కార్తీక్ వెంటనే అప్పీల్ చేయగా.. అంపైర్ నాటౌట్ గా ప్రకటించాడు. దీనిపై రివ్యూకు వెళ్లిన భారత్ వికెట్ సాధించింది. అదే ఓవర్లో మరోసారి బంతి మ్యాక్స్ వెల్ బ్యాట్ కు తగులుతూ వెళ్లగా కార్తీక్ క్యాచ్ పట్టాడు. మళ్లీ అప్పీల్ చేయగా.. మరలా అంపైర్ నాటౌట్ గానే ప్రకటించాడు. వెంటనే రోహిత్ డీఆర్ ఎస్ తీసుకోగా.. వికెట్ వచ్చింది. దీని గురించే రోహిత్ కార్తీక్ పై ఆగ్రహం వ్యక్తంచేశాడు. 'గట్టిగా అప్పీల్ చేయమని ఎన్నిసార్లు చెప్పాలి. రివ్యూకు వెళ్లు అని నాకెందుకు చెప్పవ్' అంటూ సరదాగా కార్తీక్ గొంతు పట్టుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. 






కీపర్ కార్తీక్ అలసత్వం 
ఈ మ్యాచ్ లో కీపర్ కార్తీక్ కూడా అలసత్వం ప్రదర్శించాడు. బాల్స్ బ్యాట్స్ మెన్ ప్యాడ్లకు తగులుతున్నా నమ్మకంగా అప్పీల్ చేయడంలేదు. ఎల్బీడబ్ల్యూ, వికెట్ల వెనుక క్యాచ్ విషయంలో కీపర్ అలెర్ట్ గా ఉండాలి. బ్యాట్స్ మెన్ కు దగ్గరగా ఉంటాడు కాబట్టి ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా వ్యవహరించాలి. రివ్యూలు తీసుకునే విషయంలో కెప్టెన్ కు సహకరించాలి. అయితే నిన్నటి ఆసీస్ మ్యాచులో కార్తీక్ కొంచెం నిర్లక్ష్యంగానే కనిపించాడు. 


గెలిచిన ఆసీస్ 
మొహాలి వేదికగా జరిగిన మొదటి టీ20లో భారత్ పై ఆసీస్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా.. రాహుల్, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యల మెరుపులతో 208 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే ఆసీస్ మరో 2 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందుకుంది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో కామెరూన్ గ్రీన్, మాథ్యూ వేడ్ రాణించారు. ఈ గెలుపుతో సిరీస్ లో ఆసీస్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టీ20 నాగ్ పూర్ లో 23న జరగనుంది.