Women’s T20 Asia Cup Schedule:- మహిళల ఆసియా కప్- 2022 ఎడిషన్ షెడ్యూల్ విడులయ్యింది. బీసీసీఐ కార్యదర్శి జైషా మంగళవారం తన ట్విట్టర్ ఖాతాలో షెడ్యూల్ ను అధికారికంగా ప్రకటించారు. ఈ టోర్నీ అక్టోబర్ 1 నుంచి ప్రారంభమవుతుంది. అక్టోబర్ 15తో ముగుస్తుంది. దీనికి బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇస్తోంది.


అక్టోబర్ 1న థాయ్ లాండ్ తో బంగ్లాదేశ్ తలపడటంతో ఈ టోర్నీ ప్రారంభమవుతుంది. అదే రోజున భారత్ శ్రీలంకను ఢీకొంటుంది. లీగ్ దశ మ్యాచులు అక్టోబర్ 11 వరకు జరుగుతాయి. 13న సెమీఫైనల్స్, 15న ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. 


మొత్తం 7 జట్లు


ఈ లీగ్ రౌండ్ రాబిన్ పద్ధతిలో జరగబోతోంది. మొత్తం 7 జట్లు ఈ టోర్నీలో పాల్గొనబోతున్నాయి. భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్థాన్, థాయ్ లాండ్, యూఏఈ, మలేషియా జట్లు పాల్గొంటాయి. టాప్- 4 లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్ కు అర్హత సాధిస్తాయి. అఫ్ఘనిస్థాన్ కు మహిళల క్రికెట్ జట్టు లేనందున ఆ దేశం ఈ టోర్నమెంట్ లో పాల్గొనడం లేదు. 


7 లో 6 భారత్ వే


ఇప్పటివరకు మహిళల ఆసియా కప్ టోర్నమెంట్ 7 ఎడిషన్ లు జరిగింది. అందులో 6 సార్లు భారత్ కప్ గెలుచుకుంది. 2018లో జరిగిన చివరి టోర్నీలో భారత్ పై బంగ్లాదేశ్ విజయం సాధించింది. ప్రస్తుతం జరగబోయేది ఎనిమిదో ఎడిషన్. ఇందులో గెలిచి ఏడోసారి టైటిల్ గెలుచుకోవాలని టీమిండియా అమ్మాయిలు భావిస్తున్నారు. మరోవైపు కప్ ను నిలబెట్టుకోవాలని బంగ్లా పట్టుదలతో ఉంది. 
2022 ఏసీసీ మహిళల టీ20 ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరుకున్న యూఏఈ, మలేషియా జట్లు ఆసియా కప్ లో తమ బెర్తులను సాధించుకున్నాయి.


మహిళల ఆసియా కప్ 2022 సిల్హెట్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, రేణుకా సింగ్ ఠాకూర్ వంటి కీలక ఆటగాళ్లతో కూడిన భారత జట్టు మెరుగ్గా ఉంది. వీరు రాణిస్తే మరో ఆసియా కప్ మన దేశానికి వచ్చినట్లే