PayCM Posters: కర్ణాటక ప్రభుత్వ అవినీతిని బట్టబయలు చేసేందుకు కాంగ్రెస్ వినూత్న నిరసన చేపట్టింది. '40 పర్సెంట్ సర్కార్' అంటూ కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన రాజకీయ దుమారం రేపింది. సీఎం బసవరాజ్ బొమ్మై ఫోటో, క్యూఆర్‌కోడ్‌తో 'పేసీఎం' అని ముద్రించిన పోస్టర్లను కాంగ్రెస్.. బెంగళూర్ నగరమంతటా ఏర్పాటు చేసింది.
ఇదేందయ్యా ఇది!
ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే యూజర్లను భాజపా అవినీతి పాలనపై ఫిర్యాదులు చేసే వెబ్‌సైట్‌కు తీసుకువెళ్లేలా దీన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కర్ణాటక సర్కార్ హయాంలో ఏ పని జరగాలన్న 40 శాతం కమిషన్ ప్రభుత్వానికి ముట్టజెప్పాలని కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకే ఈ ప్రచారం చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది.
అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేకంగా వెబ్‌సైట్ లాంఛ్ చేసింది. భాజపా ప్రభుత్వం లూటీదారులు, స్కామ్‌స్టర్‌లతో నిండిపోయిందని కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు.
సీఎం మార్పు!
కర్ణాటకలో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. యడియూరప్పను సీఎంగా తప్పించి బసవరాజ్ బొమ్మైను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టిన భాజపా అధిష్ఠానానికి ప్రస్తుతం కొత్త తలనొప్పులు వచ్చాయి. ఇటీవల హిజాబ్, హలాల్, లౌడ్ స్పీకర్ వంటి వివాదాలు కర్ణాటకను కుదిపేశాయి. ఆ సమయంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు జరగొచ్చనే ప్రచారం జోరందుకుంది. అయితే ఆ ప్రచారం ఇప్పటివరకు నిజం కాలేదు.
అయితే ఇటీవల పార్టీ జాతీయ సెక్రటరీ బీఎల్ సంతోష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర నాయకత్వంపై నిర్ణయాలు తీసుకునే అధికారం భాజపా అధిష్ఠానానికి ఉందని సంతోష్ అన్నారు. గుజరాత్‌లో చేసినట్లుగానే కర్ణాటకలోనూ మార్పులు చేసే అవకాశముందన్నారు.
అయితే యడియూరప్ప సూచనల మేరకే అప్పట్లో కొత్త ముఖ్యమంత్రిగా బొమ్మైను ఎంపిక చేసింది భాజపా హైకమాండ్. పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న లింగాయత్‌లను సంతృప్తిపరుస్తూ అదే వర్గానికి చెందిన బసవరాజ్ బొమ్మైకి అవకాశం కల్పించింది. శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి అత్యధిక స్థానాలు కట్టబెట్టే ఉత్తర కర్ణాటక ప్రాంతానికి (హావేరి) చెందిన నేతకు అవకాశం కల్పించింది.
భాజపా సీఎంలకు ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం, పార్టీలో సుదీర్ఘ సభ్యత్వం ఉండాలన్న సంప్రదాయాన్ని బసవరాజ ఎంపికలో అధిష్ఠానం పక్కన పెట్టింది. కర్నాటకలో బలమైన సామాజికవర్గంగా ఉన్న లింగాయత్ నేతకే సీఎం పదవిని కట్టబెట్టింది.
Also Read: Ant Research: ఈ భూమి మీద మొత్తం ఎన్ని చీమలున్నాయో తెలుసా?
Also Read: Heroin Seized In Mumbai: 22 టన్నుల హెరాయిన్ స్వాధీనం- విలువ తెలిస్తే మైండ్ బ్లాక్ అవుద్ది!