‘‘అప్పుల విషయంలో ఏపీ పూర్తి నియంత్రణతో ఉంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మనం చేస్తున్న అప్పులు తక్కువే. ఏపీ ఆర్థిక వ్యవస్థను బాగా నిర్వహిస్తున్నాం. మేం ఎక్కువ అప్పులు చేస్తున్నామంటూ అనవసరంగా మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఏపీ ఆర్థిక వ్యవస్థ నియంత్రణలోనే ఉంది’’ అని ఇటీవల ఏపీ సీఎం జగన్ అసెంబ్లీలో చెప్పారు. అయితే, ఇందుకు విరుద్ధంగా తాజాగా కాగ్, 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై విడుదల చేసిన నివేదిక చాటుతోంది. ఈ నివేదికను ఏపీ శాసనసభలో బుధవారం (సెప్టెంబరు 21) ప్రవేశపెట్టారు.
ఏపీలో అప్పులు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయని కాగ్ తేల్చి చెప్పింది. భవిష్యత్తుకు రుణ భారాన్ని పెంచుతున్నారని స్పష్టంగా పేర్కొంది. రెవెన్యూ వ్యయాన్ని భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రుణాలను వాడుతోందని నివేదికలో విశ్లేషించింది. రాష్ట్రంలో తీసుకున్న రుణాల్లో ఏకంగా 81 శాతం రెవెన్యూ ఖర్చుల కోసమే వాడుతున్నారని పేర్కొంది. మరోవైపు బడ్జెట్‌లో చూపకుండా పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుంటున్నారని నివేదికలో పేర్కొంది. దీంతో మొత్తం రుణాలను, ద్రవ్యలోటునూ తగ్గించి చూపుతున్నారని వివరించింది. దీనివల్ల రాష్ట్ర స్థూల ఉత్పత్తి (State Gross Product) లో రుణాల వాటా ఏకంగా 44 శాతానికి పెరిగిందని కాగ్ తేల్చి చెప్పింది.
కాగ్ నివేదికలోని ముఖ్యాంశాలు ఇవీ..
* అప్పుల భారం ఏపీ రాష్ట్రంపై ఎక్కువ అవుతోంది. వాటిని తీర్చేందుకు సరైన వ్యూహం లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలకు కూడా నిధులు తగ్గిపోయే అవకాశం ఉంది.
* 2020-21 ఆర్థిక సంవత్సరానికి మొత్తం రుణాలు జీఎస్‌డీపీలో 35 శాతం దాటకూడదని ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం (Fiscal Responsibility and Budget Management Act) చెబుతోంది. కానీ, 2021 మార్చి 31కి ఏపీకి చెందిన ఈ రుణాలు 35.30 శాతంగా ఉండి చట్టంలో పేర్కొన్న పరిధులను దాటాయి.
* బడ్జెట్‌లో చూపించకుండా బయటి నుంచి తీసుకునే రుణాలనూ చూస్తే జీఎస్‌డీపీలో రుణాల మొత్తం 44.04 శాతంగా ఉంటోందని కాగ్ నివేదికలో స్పష్టం చేసింది.
* ఆంధ్రప్రదేశ్‌లో 2021 మార్చి 31 నాటికి రూ.86,259.82 కోట్ల రూపాయలు బడ్జెట్‌లో చూపని విధంగా ప్రభుత్వం అప్పు తీసుకుంది. వేర్వేరు కార్పొరేషన్లు, సంస్థల ద్వారా ఈ రుణాలు పొందింది. ఇవీ కలిపితే మొత్తం బకాయిలు రూ.4,34,506 కోట్లు. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేసిన రుణాలే అవుతాయి.
* దీని ప్రకారం.. రాబోయే ఏడేళ్లలో 45.74 శాతం అంటే రూ.1,23,640 కోట్ల మేర అప్పులు తీర్చాలని, అందుకు సరైన వ్యూహం లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు తగ్గిపోతాయని హెచ్చరించింది.
* 2016 నాటికి ఉన్న రుణాల కన్నా 2021 నాటికి ఉన్న రుణాలు బాగా పెరిగాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో రుణాలు రూ.2,01,314 కోట్లు ఉంటే 2019-20 నాటికి రూ.3,48,246 కోట్లకు చేరాయి. అంటే రుణాల్లో 72.99 శాతం ఉందని కాగ్ చెప్పింది. రెవెన్యూ లోటు ఐదేళ్ల గరిష్ఠ స్థాయికి చేరింది. 2020-21లో అత్యధికంగా రూ.35,541 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడింది.
* కాగ్ రిపోర్టులో ఉన్న వివరాల ప్రకారం.. రాష్ట్రానికి రోజూ రిజర్వుబ్యాంకు వద్ద రూ.1.94 కోట్ల నగదు నిల్వ ఉండాలి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 34 రోజులే ఇలా ఉంది. మిగిలిన 331 రోజులూ రిజర్వుబ్యాంకు నుంచి అప్పులు తీసుకోవాల్సి వచ్చింది.
* ఆరోగ్య రంగంలో ఆంధ్రప్రదేశ్ ఖర్చు చేస్తున్న నిధులు తక్కువగానే ఉన్నాయని కాగ్ చెప్పింది. పొరుగు రాష్ట్రాలు ఆరోగ్యరంగంపై 6.74 శాతం నిధులు ఖర్చు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ 5.49 శాతం మాత్రమే ఖర్చు చేసినట్లు రిపోర్ట్ లో తెలిపింది.