Minister Jogi Ramesh: ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై పిచ్చి ప్రేలాపనలు పేలితే చెంప ఛెళ్లుమనిపిస్తామని టీడీపీ యువనేత నారా లోకేష్ పై గృహ‌ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఫైర్ అయ్యారు. ఎవరి హయాంలో ఎన్ని వైద్య కళాశాలలు వచ్చాయనే అంశంపై దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. సచివాలయంలో మీడియా ముందు మంత్రి జోగి రమేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఎన్టీఆర్ ఎందుకు గుర్తు రాలేరని ప్రశ్నించారు. లోకేశ్ పాదయాత్ర కాదు.. పొర్లు దండాలు పెట్టినా ఏం చేయలేరని విమర్శించారు. యూనివర్సిటీకి వైఎస్ పేరు పెట్టేలా కేబినెట్ నిర్ణయం లేకుండా బిల్లు ఎలా పాస్ చేశారని మంత్రిని విలేకర్లు ప్రశ్నించగా... ఆన్ లైన్ లో నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. 


మొన్నటికి మొన్న బాబుపై ఫైర్ అయిన మంత్రి..


టీడీపీ మీద ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది అనడానికి కుప్పం సంఘటనలే నిదర్శనమని ఏపీ గృహ‌నిర్మాణ శాఖ మంత్రి జోగి ర‌మేష్ అన్నారు. చంద్రబాబుపై ప్రజల్లో నమ్మకం పోయిందని ఆయ‌న వ్యాఖ్యానించారు. టీడీపీ జెండాను, పార్టీని కూకటి వేళ్లతో పెకిలించడానికి ప్రజలు సిద్ధమయ్యారన్నారు. 14 ఏళ్లు సీఎంగా చేసినా చంద్రబాబు ఒక వర్గానికి అయినా మేలు చేశారా? అని ప్రశ్నించారు. 33 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు ఏంచేశారని అని కుప్పం ప్రజలు తిరుగుబాటు చేశారన్నారు. ఆ తిరుగుబాటు కుప్పంలో బీసీల నుంచే ప్రారంభం అయిందని మంత్రి తెలిపారు. చంద్రబాబు వాడుకుని వదిలేశారని బీసీలు, మైనారిటీ, ఎస్సీ ఎస్టీలు, మహిళలు అందరూ తిరుగుబాటు చేశారన్నారు. 


చంద్రబాబు రాష్ట్రంలో తిరగడానికి వీళ్లేదు! 


మూడేళ్లలో సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారని ప్రజలే చెప్తున్నారని మంత్రి జోగి అన్నారు. కుప్పం ప్రజల్ని బానిసలుగా చేసుకున్న చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని కుప్పం వస్తారని వాళ్లు ప్రశ్నిస్తున్నారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మూడుసార్లు కూడా కుప్పం వెళ్లని చంద్రబాబు ఇప్పుడు వరుస పర్యటనలతో హడావుడి చేస్తున్నారని విమర్శించారు. కుప్పంలో మొదలైన ఈ తిరుగుబాటు 175 నియోజకవర్గాలకు విస్తరిస్తుందన్నారు. చంద్రబాబు ఈ రాష్ట్రంలో తిరగడానికి వీళ్లేదని ప్రజలే ముక్త కంఠంతో చెప్తున్నారన్నారు. ఓట్లు దండుకుని సున్నం పెట్టాడని అన్ని వర్గాలు తిరుగుబాటు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. ప్రజల్ని ఓటు అడిగే హక్కు చంద్రబాబుకి, ఆ పార్టీ నాయకులకు లేదన్నారు. 






ఎవరేం చేసినా గెలిచేది వైసీపీయే..!


ప్రజలంతా మనసున్న ముఖ్యమంత్రి జగన్ అని జేజేలు కొడుతున్నారని అన్నారు. ప్రజలు కూడా పార్టీలు, కులాలు, మతాలు చూడం, జగన్ ని మాత్రమే చూస్తామని చెప్తున్నారన్నారు. కుప్పం నియోజకవర్గంలోనే అభివృద్ధికి దిక్కు లేదని, ఇక రాష్ట్రానికి ఏం  చేస్తావ్ చంద్రబాబు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా కుప్పంతో సహా 175 స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందన్నారు. కుప్పం చంద్రబాబు గడ్డ కాదు వైఎస్సార్ అడ్డాగా మారిపోయిందన్నారు. చంద్రబాబు ఏ నియోజకవర్గానికి వెళ్లినా ఓడిపోవడం ఖాయమన్నారు.  చంద్రబాబు 14 ఏళ్ల పరిపాలనను, జగన్ మూడేళ్ల పరిపాలనను ప్రజలు బేరీజు వేసుకుంటున్నారన్నారు. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ఏం చేయలేకపోయారన్నారు.