Congress President Election: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అథారిటీ.. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల నోటిఫికేషన్‌ను గురువారం విడుదల చేసింది.
ముఖ్యమైన తేదీలు
- నామినేషన్లకు చివరి తేదీ: సెప్టెంబర్ 30
- నామినేషన్ పత్రాల పరిశీలన: అక్టోబర్ 1
- నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: అక్టోబర్ 8
- ఓటింగ్: అక్టోబర్ 17
- ఫలితాలు: అక్టోబర్ 19
పోటీలో ఎవరు?
పార్టీ అధ్యక్ష పదవి నుంచి సోనియా తప్పుకోనుండటం, బాధ్యతల స్వీకరణకు రాహుల్ మెుగ్గు చూపకపోవడం వంటి పరిణామాల వల్ల ఈ సారి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. అయితే ఈ పదవి కోసం ఎవరెవరు పోటీ పడతారనే దానిపై పూర్తి స్పష్టత లేదు. అయితే రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తామని అయితే క్లారిటీ ఇచ్చారు.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఇచ్చిన బాధ్యతను తాను నిర్వర్తిస్తానని, పార్టీ చెబితేనే అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేస్తానని ఆయన అన్నారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీకి ముందు గహ్లోత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
సోనియాతో భేటీ తర్వాత కొచ్చి వెళ్లి రాహుల్ గాంధీని కూడా కలవనున్నట్లు గహ్లోత్ తెలిపారు. పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టాలని రాహుల్ గాంధీని ఒప్పించేందుకు చివరి ప్రయత్నం చేస్తానని గహ్లోత్ అన్నారు.
" పార్టీ, హైకమాండ్ నాకు అన్నీ ఇచ్చాయి. 40-50 ఏళ్లుగా పదవుల్లో ఉన్నాను. నాకు ఏ పదవీ ముఖ్యం కాదు. ఏ బాధ్యత ఇచ్చినా సక్రమంగా నిర్వర్తిస్తాను. గాంధీ కుటుంబానికే కాదు, అనేక మంది కాంగ్రెస్ సభ్యులకు కూడా నాపై విశ్వాసం ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ సభ్యుల ఆప్యాయత నాకు లభించడం, నన్ను వారు విశ్వసించడం నా అదృష్టం. అందుకే కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయమని వాళ్లు అడిగితే తిరస్కరించలేను. నా మిత్రులతో మాట్లాడతాను. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా నాకు బాధ్యతలు అప్పగించారు. సీఎంగా ఆ బాధ్యతను నిర్వర్తిస్తున్నాను. అది కొనసాగుతుంది. "
థరూర్ సై
మరోవైపు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగాలని పార్టీ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ నిర్ణయించుకున్నారు. ఈ విషయంపై ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తన నిర్ణయాన్ని థరూర్ ఆమె ముందు ఉంచగా.. "మీ ఇష్టం. అధ్యక్ష పదవి కోసం ఎవరైనా పోటీ పడవచ్చు" అంటూ సోనియా కూడా పచ్చజెండా ఊపినట్టు సమాచారం.
అయితే అధ్యక్ష బరిలో ఎవరు నిల్చున్నా తాను మాత్రం వ్యక్తిగతంగా ఎవరికీ మద్దతు ప్రకటించకుండా తటస్థంగా ఉంటానని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. పోటీకి తాను సన్నద్ధమవుతున్నట్టు కొద్ది రోజుల క్రితమే థరూర్ ప్రకటించారు. పార్టీలో అంతర్గత సంస్కరణలు చేపట్టాలని థరూర్ ఎప్పటి నుంచో కోరుతున్నారు.
దిగ్విజయ్
తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఈ రోజు దిల్లీకి చేరుకోనున్నారు. ఆయన పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసే అవకాశం ఉందని, పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం ఉందని వార్తా సంస్థ ANI పేర్కొంది.
Also Read: Sharad Pawar: కాంగ్రెస్‌తో కలిసేందుకు దీదీ రెడీ- శరద్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు
Also Read: Lalu Prasad VS BJP: 'త్వరలోనే సోనియా, రాహుల్‌ను కలుస్తాం- 2024లో భాజపాను గద్దె దించుతాం'