Smriti Mandhana Record: 


భారత మహిళా బ్యాటర్ స్మృతి మంధాన అరుదైన రికార్డు సాధించారు. భారత్ తరఫున శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీల తర్వాత వన్డేల్లో అతి తక్కువ ఇన్నింగ్సుల్లో 3 వేల పరుగుల మైలురాయిని అందుకున్న క్రికెటర్ గా రికార్డులకెక్కారు. ధావన్ 72 ఇన్నింగ్సుల్లో, కోహ్లీ 75 ఇన్నింగ్సుల్లో 3 వేల పరుగులు అందుకుంటే.. మంధాన 76 ఇన్నింగ్సుల్లో ఆ మైలురాయిని చేరుకున్నారు. ఇంగ్లండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో ఈ ఫీట్ అందుకుంది. 


ఇటీవలే టీ20ల్లో ప్రపంచ నెం. 2 ర్యాంకు సాధించిన భారత స్టైలిష్ బ్యాటర్ స్మృతి మంధాన.. వన్డేల్లోనూ ఉత్తమంగా రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే బిలిండా క్లార్క్ (62 ఇన్నింగ్స్), మెగ్ లానింగ్ (64 ఇన్నింగ్స్) తర్వాత అతి తక్కువ ఇన్నింగ్సుల్లో 3 వేల పరుగులు చేసిన మహిళా క్రీడాకారిణిగా రికార్డులకెక్కారు. అలాగే మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్ కౌర్ తర్వాత 3 వేల పరుగులు చేసిన భారత మహిళా క్రికెటర్ గా నిలిచారు. స్మృతి వన్డే కెరీర్ లో 24 అర్ధ శతకాలు, 5 శతకాలు ఉన్నాయి.  


దంచి కొట్టిన హర్మన్.. ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యం


ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో వన్డేల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 333 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 143 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. ఆమెతోపాటు హర్లీన్ డియోల్ (58), స్మృతి మంధాన (40) రాణించారు. దీంతో నిర్ణీత ఓవర్లలో భారత్ 5 వికెట్లు కోల్పోయి 333 పరుగులు చేసింది.