ICC World Test Championship Finals 2023 2025: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ రెండో ఎడిషన్‌ ఫైనల్‌ వేదికను ఐసీసీ ప్రకటించింది. ఈ ప్రతిష్ఠాత్మక పోరుకు ఇంగ్లాండ్‌లోని ఓవల్‌ ఆతిథ్యమిస్తుందని తెలిపింది. 2023, జూన్‌లో మ్యాచ్‌ ఉంటుందని వెల్లడించింది. ఇక 2025 ఎడిషన్‌ ఫైనల్‌ను క్రికెట్‌ మక్కా లార్డ్స్‌లో నిర్వహిస్తామని పేర్కొంది. 2023 ఎడిషన్‌ ఫైనల్‌ తేదీలను మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. బహుశా బర్మింగ్‌హామ్‌లో జూన్‌ 16న ఆరంభమయ్యే యాషెస్‌కు ముందే ఉంటుందని తెలుస్తోంది.


ఇంగ్లాండ్‌లోనే 3 ఫైనళ్లు


మొత్తంగా వరుగా మూడు WTC ఫైనళ్లకు ఇంగ్లాండే వేదిక అవుతుండటం గమనార్హం. 2021లో సౌథాంప్టన్‌ వేదికగా జరిగిన ఫైనల్లో టీమ్‌ఇండియాను న్యూజిలాండ్‌ ఓడించి ట్రోఫీ కైవసం చేసుకుంది. వాస్తవంగా ఈ మ్యాచ్‌ లార్డ్స్‌లో జరగాలి. కరోనా కారణంగా మెరుగైన ఆతిథ్య వసతులు ఉన్న సౌథాంప్టన్‌కు వేదికను తరలించారు. ప్రతి ఎడిషన్‌లో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు ఫైనల్‌ ఆడతాయి.


ఆసీస్‌తో గట్టిపోటీ


ప్రస్తుత ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఎడిషన్లో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా, శ్రీలంక వరుసగా 2, 3 స్థానాల్లో ఉన్నాయి. భారత్‌, పాకిస్థాన్‌ 4, 5 ప్లేసుల్లో కొనసాగుతున్నాయి. ఈ ఎడిషన్‌ ముగిసేందుకు ఇంకా మ్యాచులు మిగిలే ఉన్నాయి. అంటే ఫైనల్‌ చేరేందుకు టీమ్‌ఇండియాకు అవకాశాలు మిగిలే ఉన్నాయి. వాస్తవంగా నెల రోజుల ముందు వరకు దక్షిణాఫ్రికా మొదటి స్థానంలో ఉండేది. ఇంగ్లాండ్‌ చేతిలో 2-1తో సిరీస్‌ చేజార్చుకోవడంతో కిందకు వెళ్లింది. ఈ సైకిల్‌లో వారికి ఇంకా రెండు సిరీసులు మిగిలే ఉన్నాయి. ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌తో తలపడనుంది. టీమ్‌ఇండియాతో వారికి తీవ్రంగా పోటీ ఉంది. ఎందుకంటే హిట్‌మ్యాన్‌ సేన త్వరలోనే బంగ్లాదేశ్‌, ఆస్ట్రేలియా సిరీసుల్లో తలపడనుంది. ఆసీస్‌ ఇంకా 9 మ్యాచులు ఆడనుంది. పాకిస్థాన్‌, శ్రీలంకకు టాప్‌-2లో చేరుకొనే అవకాశం ఉంది.


గొప్ప వేదికలు


'ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ను వచ్చే ఏడాది ఓవల్‌లో నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఆ వేదికను ఘన వారసత్వం ఉంది. చక్కని వాతావరణం ఉంటుంది' అని ఐసీసీ సీఈవో జెఫ్‌ అలార్డిస్‌ అన్నారు. 'ఆ తర్వాత 2025 ఎడిషన్‌ ఫైనల్‌ను లార్డ్స్‌లో నిర్వహిస్తాం. ఆ వేదిక తుది సమరానికి అసలైన నిర్వచనం ఇస్తుంది' అని ఆయన పేర్కొన్నారు.


ఐపీఎల్‌కు మధ్యలోనే దూరం!


ఐపీఎల్‌ 2023 సీజన్‌ నుంచి ఆసీస్‌, ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు మధ్యలోనే వెళ్లిపోవచ్చు. ఇంగ్లాండ్‌ సమ్మర్‌ షెడ్యూలు జూన్ 1 నుంచి ఆరంభమవ్వడమే ఇందుకు కారణం. ఆంగ్లేయులు మొదట ఐర్లాండ్‌తో ఒక టెస్టు ఆడతారు. జూన్‌ 16 నుంచి ఆస్ట్రేలియాతో యాషెస్‌ సిరీసులో తలపడతారు. మొదటి మ్యాచ్‌ బర్మింగ్‌హామ్‌లో జరుగుతుంది. వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్‌ను మరింత కాలం పొడగించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ సీజన్లో ఐపీఎల్‌ మే ఆఖరి వరకు జరిగింది. వచ్చే సీజన్లో ఇంకాస్త ఎక్కువ రోజులే జరగొచ్చు. అలాంటప్పుడు ఆసీస్‌, ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు పూర్తి సీజన్‌కు అందుబాటులో ఉండరు.