Hate Crime Canada: 


భగవద్గీత పార్క్‌లో అవమానం..


కెనడాలో భారతీయులను కించపరిచే వరుస ఘటనలు జరుగుతున్నాయి. కొంత కాలంగా అక్కడి పోలీసులు పలు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెడుతున్నారు. అయినా...ఎక్కడో ఓ చోట మళ్లీ ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కెనడాలోని బ్రాంప్టన్ సిటీలో ఓ పార్క్‌లోని సైన్ బోర్డ్‌ను మార్చేశారు. ఈ పార్క్‌కు "శ్రీ భగవద్గీత పార్క్" అని పేరు పెట్టారు. ఈ పార్క్ పేరుని సూచించే బోర్డ్‌ను ఎవరో తొలగించారు. దాని స్థానంలో ఖాళీగా ఉన్న బోర్డ్‌ను పెట్టారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేశారని అక్కడి హిందువులు మండి పడుతున్నారు. దీనిపై...సిటీ మేయర్ స్పందించారు. మెయింటేనెన్స్ కోసం బోర్డు తొలగించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. అయినా... దీనిపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. నిన్న మొన్నటి వరకూ ఈ పార్క్‌ను Troyers Parkగా పిలిచేవారు. ఈ మధ్యే భగవద్గీత పేరు పెట్టారు. ఇది సహించలేకే ఇలా అవమానపరిచారన్నది హిందువుల వాదన. ఇటు కెనడాలోని హై కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. "భారతీయులపై ఈ వివక్షను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. కెనడా పోలీసులు, అధికారులు విచారణ చేపట్టి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి" అని ట్వీట్ చేసింది. 






విచారణ


"ఈ ఘటనపై విచారణ చేపడుతున్నాం. శ్రీ భగవద్గీత సైన్‌బోర్డ్‌ను రీ ప్రింట్ చేయటానికి తీసుకెళ్లారు. అప్పటి వరకూ ఆ ప్లేస్‌లో ఖాళీ బోర్డ్‌ను పెట్టారు. బిల్డర్ చేసిన పని ఇది. త్వరలోనే ఈ బోర్డ్‌ని రీప్లేస్ చేస్తారు" అని చెప్పారు మేయర్ పాట్రిక్ బ్రౌన్. అంతే కాదు. ఈ ఘటనను తమ దృష్టికి తీసుకొచ్చినందుకు భారతీయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి వాటిని సహించేదే లేదని, ఇప్పటికే పార్క్ సిబ్బంది ఈ సమస్యను పరిష్కరించే పనిలో నిమగ్నమైందని చెప్పారు. 






అప్రమత్తంగా ఉండాలన్న భారత్ 


కెనడాలో భారతీయులపై వివక్ష, దాడులు పెరుగుతున్న క్రమంలో భారత ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కెనడాలోని ఇండియన్స్ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. యాంటీ ఇండియా ఉద్యమం నడుస్తున్న నేపథ్యంలో పరిస్థితులను సునిశితంగా గమనించాలని సలహా ఇచ్చింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ విషయం వెల్లడించింది. Pro-Khalistan ఉద్యమం కెనడాలో జోరందుకుంటోంది. సిక్కులకు ప్రత్యేక ప్రాంతం కావాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. ఆ దేశంలో ఈ ఉద్యమానికి సంబంధించిన అలజడి ఎక్కువగా కనిపిస్తోంది. ఎప్పటి నుంచో ఇది నడుస్తూనే ఉన్నా..ఈ మధ్య కాలంలో ఉద్ధృతమైంది. భారత్-కెనడా మధ్య ఎప్పుడు చర్చలు జరిగినా...ఈ సమస్య గురించి ప్రస్తావన వచ్చేది. "భారతీయులపై విద్వేషం పెరుగుతోంది. హింసాత్మక ఘటనలూ పెరుగుతున్నాయి" అని కెనడాలోని భారతీయులు, భారతీయ విద్యార్థులు వెల్లడించారు. "భారతీయులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా, సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాం" అని భారత విదేశాంగ శాఖ తెలిపింది. వరుసగా జరుగుతున్న ఘటనలపై దృష్టి సారించి విచారణ జరపాలని కెనడాలోని భారత్ హై కమిషన్ కోరింది. ఇప్పటి వరకూ నిందితులను పట్టుకోలేదని అసహనం వ్యక్తం చేసింది. 


Also Read: Durga Puja Pandal Fire: దుర్గామాత మండపంలో అగ్ని ప్రమాదం- ఐదుగురు మృతి, 64 మందికి గాయాలు!