Anil Vij On Hijab Ban: హిజాబ్ వివాదంపై హరియాణా మంత్రి, భాజపా నేత అనిల్ విజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పురుషులు తమ మనస్సును జయించాలని, హిజాబ్ నుంచి మహిళలకు విముక్తి కల్పించాలని ఆయన అన్నారు.
హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చే కొద్ది సేపటి ముందు ఆయన ఈ ట్వీట్ చేశారు.
భిన్న తీర్పులు
కర్ణాటక హిజాబ్ వివాదంపై సుప్రీం కోర్టు ఎటూ తేల్చలేదు. ఇద్దరు న్యాయమూర్తులు భిన్నమైన తీర్పులు ఇచ్చారు. హిజాబ్‌పై కర్ణాటక ప్రభుత్వ నిషేధాన్ని కొనసాగించేలా ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ హేమంత్ గుప్తా సమర్థించారు. ఈ వివాదంపై దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని ప్రతిపాదించారు.
మరోవైపు జస్టిస్ సుధాన్షు ధూలియా ఇందుకు భిన్నంగా తీర్పు రాశారు. కర్ణాటక హైకోర్టు తీర్పును పక్కనబెడుతూ హిజాబ్ బ్యాన్పై అపీళ్లను స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది కేవలం ఛాయిస్ మాత్రమేనని, అంతకంటే ఎక్కువ లేదా తక్కువ కాదని జస్టిస్ సుధాన్షు ధూలియా అన్నారు.
సుప్రీం న్యాయమూర్తులు వేర్వేరు తీర్పులు ఇవ్వడంతో ఈ వ్యవహారాన్ని త్రిసభ్య ధర్మాసనానికి లేదా విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసే అవకాశం ఉంది. అయితే ఈ నిర్ణయాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి తీసుకోవాలి.
కర్ణాటక హైకోర్టు తీర్పు
విద్యా సంస్థల్లో హిజాబ్ ధరించకూడదనే వివాదంపై దాఖలైన పిటిషన్లపై కర్ణాటక హైకోర్టు ఇటీవల సంచలన తీర్పు వెలువరించింది. స్కూళ్లు, కాలేజీల్లోకి హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి.
ఈ కేసులో 10 రోజుల పాటు వాదనలు సాగగా, పిటిషనర్ల తరఫున 21 మంది న్యాయవాదులు, ప్రతివాదుల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అడిషనల్ సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్, కర్ణాటక అడ్వకేట్ జనరల్ ప్రభులింగ్ నవాద్గీ వాదించారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు ఇంతకుముందు తన తీర్పును రిజర్వ్ చేసింది. గురువారం తీర్పును వెలువరించింది.
Also Read: Viral Video: ఇదేందిరా నాయనా! చిరుతతో యువతి లిప్ లాక్- వైరల్ వీడియో!