Bihar News: 'సాయి బాబా సీరియల్ చూశాను- తర్వాత ఓ అద్భుతం జరిగింది'

ABP Desam Updated at: 13 Oct 2022 02:38 PM (IST)
Edited By: Murali Krishna

Bihar News: సాయి బాబా సీరియల్ చూడటం వల్ల తన జీవితంలో ఓ అద్భుతం జరిగిందని బిహార్ మంత్రి తేజ్ ప్రతాప్ అన్నారు.

(Image Source: PTI)

NEXT PREV

Bihar News: ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్‌ ప్రతాప్ యాదవ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం బిహార్ అటవీ శాఖ మంత్రిగా ఉన్న తేజ్‌ ప్రతాప్.. సాయి బాబా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శిరిడీ సాయి బాబా తన జీవితంలో అద్భుతం చేశారని తేజ్‌ ప్రతాప్ అన్నారు.


సీరియల్ చూస్తూ


టీవీలో ప్రసారమవుతోన్న సాయి బాబా సీరియల్ ఇటీవల తాను చూశానని తేజ్‌ ప్రతాప్ అన్నారు. సీరియల్ చూస్తూ సాయి బాబా ఆశీర్వాదం తనకు దక్కాలని కోరుకున్నానని తెలిపారు. ఆ తర్వాత బుధవారం ఓ అద్భుతం జరిగిందని తేజ్ ప్రతాప్ అన్నారు.







ఈ మధ్య సాయి బాబా సీరియల్ టీవీలో చూశాను. ఆ సమయంలో ఎందుకో శిరిడీ సాయి నాథుడి ఆశీర్వాదం నాకు దక్కితే బాగుంటుందని అనుకున్నాను. బుధవారం నేను మా ఇంట్లో నిర్మిస్తోన్న కార్యాలయానికి వెళ్లి చూసేసరికి అద్భుతం జరిగింది. నా టేబుల్‌పై శిరిడీ సాయి బాబా ఊది (విభూతి) కనిపించింది. ఇది చూసి నేను షాకయ్యాను. ఇదంతా సాయి బాబా, శ్రీ కృష్ణుడి ఆశీర్వాదం వల్లే జరిగింది. త్వరలోనే నేను శిరిడీకి వెళ్లి బాబాను దర్శించుకుంటాను.                                                   - తేజ్‌ ప్రతాప్ యాదవ్, బిహార్ అటవీ శాఖ మంత్రి
 


సర్వ రోగ నివారిణి


తాను శిరిడీ సాయి ట్రస్ట్‌లో సభ్యుడినని మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ తెలిపారు. ఆయన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ట్రస్ట్‌ సభ్యుడని ఆయన అన్నారు. శిరిడీ సాయి బాబా విభూతితో ప్రతి వ్యాధి నయమవుతుందని తేజ్‌ ప్రతాప్ అన్నారు. అందుకే తాను కూడా ఈ భస్మం ధరిస్తున్నట్లు తెలిపారు. అందుకోసమే బాబా.. తన టేబుల్‌పై రెండు విభూతి ప్యాకెట్లు పెట్టారని తేజ్ ప్రతాప్ అన్నారు. సాయి బాబా తన జీవితంలో అద్భుతం చేశారని తేజ్ ప్రతాప్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తేజ్‌ ప్రతాప్ తరుచూ ఏదో ఒక వ్యవహారంలో వార్తల్లో నిలుస్తుంటారు.


Also Read: India Pak At UNGA: ఐరాసలో అడిగి మరీ తిట్టించుకున్న పాకిస్థాన్- భారత్ స్ట్రాంగ్ వార్నింగ్!

Published at: 13 Oct 2022 01:23 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.