పోలీస్ కానిస్టేబుళ్లు యూనిఫామ్, లాఠీ, టోపీతోపాటు జేబులో విజిల్ కూడా తప్పనిసరిగా పెట్టుకోవాలి. అందరి జేబుల్లో విజిల్ కార్డ్ లు, ఆ కార్డ్ కి విజిల్ ఉండాలి. కానీ ఇటీవల కొంతమంది విజిల్ జేబులో పెట్టుకోవడం లేదు. నామోషీగా భావిస్తున్నారో లేక, అసలు విజిల్ తో పని ఏముందనుకుంటున్నారో కానీ, విజిల్ అనేది విధుల్లో భాగం అనే విషయం కాస్త మరుగున పడింది. ఇలా విజిల్ పెట్టుకోని కానిస్టేబుళ్లకు ఏకంగా మెమోలు జారీ చేశారు నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు. ఈ విషయం ఇప్పుడు జిల్లాలో సంచలనంగా మారింది.
నేరాల నియంత్రణకు విజిల్ బాగా ఉపయోగపడుతుందని చెప్పారు నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు. విధి నిర్వహణలో భాగంగా జేబులో విజిల్ పెట్టుకోని ఇద్దరు కానిస్టేబుళ్లకు మెమో జారీ చేయాలని ఆదేశించారు. బుధవారం నెల్లూరు నగరంలోని సంతపేట పోలీసు స్టేషన్ ను ఎస్పీ విజయరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించారు, సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా బీట్ నిర్వహణలో ఉన్నవారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎవరెవరు ఎక్కడెక్కడ విధుల్లో ఉన్నారో అడిగి తెలుసుకుని వారిని పిలిపించారు. బీట్ లో ఉన్నవారు జేబులో విజిల్ పెట్టుకున్నారా అని అడిగారు. యూనిఫాంతో పాటు విజిల్ కూడా తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు.
ఇద్దరు కానిస్టేబుళ్లకు మెమోలు..
విజిల్ తీసుకురాని ఇద్దరు కానిస్టేబుళ్లకు ఎస్పీ మెమోలు జారీ చేశారు. విజ్ల్ వల్ల ఉపయోగాలు, దాని ప్రాధాన్యంపై ఆయన క్లాస్ తీసుకున్నారు. సెట్ కాన్ఫరెన్స్ బుక్ ఎందుకు నిర్వహించడం లేదని కూడా ఆయన పోలీసులను ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఒక్క మర్డర్ కేసు కూడా పెండింగ్ లో లేదని చెప్పిన ఎస్పీ, కేవలం సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఒక హత్య కేసు పెండింగ్ లో ఉందన్నారు. అందుకే తాను ఆ స్టేషన్ పరిశీలనకు వచ్చానని చెప్పారు. వీలైనంత వరకు పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలని సూచించారు ఎస్పీ.
నేనొస్తున్నానని అతి చేయొద్దు..
నెల్లూరు నగరంలో తన పర్యటన సందర్భంగా పోలీసులు హడావిడి చేయొద్దని సూచించారు ఎస్పీ విజయరావు. ఎస్పీ వస్తున్నారని ప్రత్యేకంగా రోడ్లపై ట్రాఫిక్ క్రిలయ్ చేయొద్దని, సాధారణ రోజుల్లో కూడా ఇలాగే విధులు నిర్వహించాలని సూచించారు. కానిస్టేబుళ్లు ముఖ్యంగా రికవరీ సాధనపై దృష్టి పెట్టాలన్నారు. దోపిడీ కేసులను ఎస్సైలకు కేటాయించాలని డీఎస్పీలకు సూచించారు. ఇక స్టేషన్లలో సీజ్ చేసిన వాహనాలను కూడా ఎప్పటికప్పుడు పరిశీలించి వేలం వేయాలని సూచించారు ఎస్పీ విజయరావు.
నేరనిరోధానికి విజబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ వ్యవస్థను ముమ్మరం చేయాలని, ట్రాఫిక్, ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్ నియంత్రణపై దృష్టి పెట్టాలని సూచించారు జిల్లా ఎస్పీ విజయరావు. రౌడీ షీటర్ల వివరాలను పరిశీలించి, నిఘా ఉంచాలని సూచించారు. పోలీస్ స్టేషన్లలో నమోదైన స్పందన ఫిర్యాదులను ఎటువంటి ఆలస్యం లేకుండా పరిష్కరించాలని ఆదేశాలిచ్చారు. పరిస్థితులకు అనుగుణంగా పోలీసుల ప్రవర్తన, విధి నిర్వహణలో మార్పులు చేసుకోవాలన్నారు. అత్యవసర సేవలైన దిశ SOS, డయల్ 100 కాల్స్ పై వెంటనే స్పందించాలని ఆదేశాలిచ్చారు. పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క సిబ్బందితో ముఖాముఖి మాట్లాడి వారి విధులు, బాగోగులు అడిగి తెలుసుకున్నారు ఎస్పీ విజయరావు.