గత ఎన్నికల్లో ప్రత్యేక హోదా విషయంపై రాజకీయాలు చేస్తే ఇప్పుడు రాజధానిపై మొదలెట్టారు. వచ్చే ఎన్నికల్లో రాజధాని అంశంపైనే అధికార-విపక్షాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. రానున్న ఎన్నికల్లో ప్రజల తీర్పుని బట్టే రాజధాని డిసైడ్ అవుతుందా అన్నది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చకు తావిస్తోంది. ప్రత్యేకహోదా పక్కకు మళ్లి ఇప్పుడు రాజధాని మ్యాటర్ హైలెట్ అయ్యింది.
ఉత్తరాంధ్ర వర్సెస్ అమరావతి రాజధాని రైతుల మధ్య వైరం ప్రారంభమైంది. అసలు ఈ వివాదానికి కారకులు ఎవరు ? అంటే మీరంటే మీరని అధికార-విపక్షాలు ఆరోపించుకుంటున్నాయి. విపక్షంలో ఉన్నప్పుడు అమరావతి రాజధానికి సరేనన్న జగన్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎందుకు విశాఖను కూడా రాజధానిగా ప్రకటించారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అంతేకాదు మూడు రాజధానులు ఎక్కడైనా ఉన్నాయా.. ఉంటే అవి ఏరకంగా అభివృద్ధి చెందాయో చూపించాలని ప్రతిపక్షాలు సవాల్ చేస్తున్నాయి. రాజధాని వికేంద్రీకరణతో ఉపయోగం శూన్యం అని చెబుతోంది విపక్షం.
విపక్షాల ఈ ఆరోపణలను తప్పుబడుతున్న ప్రభుత్వం అమరావతిని శాసనసభ రాజధానిగా ఉంచామని గుర్తు చేస్తోంది. కోట్లు ఖర్చు చేసి అమరావతిలో పరిపాలనా రాజధాని నిర్మించే కన్నా ఆల్ రెడీ అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోన్న విశాఖని ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్‌గా చేస్తే ఏపీ అభివృద్ధి రాష్ట్రంగా ఉంటుందని అధికారపక్షం వాదిస్తోంది. అంతేకాదు చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో ఏపీలో ఏం అభివృద్ధి చేశారో చూపించాలని ప్రశ్నిస్తోంది.
ఇలా అధికార-విపక్షాలు ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారే తప్ప ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నది లేదన్నటాక్. ఆనాడు చంద్రబాబు, ఈనాడు జగన్ కూడా ప్రజలు ఏ ప్రాంతంలో రాజధాని కావాలని కోరుకుంటున్నారో తెలుసుకోకుండా రాజకీయపరంగా నిర్ణయాలు తీసుకోవడం వల్లే రాష్ట్రం విడిపోయి 8 ఏళ్లు కావస్తున్నా ఇంతవరకు ఏపీకి రాజధాని లేకుండా పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాజధాని పేరుతో వ్యాపారం చేస్తోన్న రాజకీయనేతల స్వార్థం వల్ల రాష్ట్రంలో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని కాబట్టి ఆలోచనతో అడుగులు వేయాల్సిన అవసరం ఉందని రాజకీయవిశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా రాజకీయనేతలు స్వార్థాన్ని వదలి రాష్ట్ర ప్రయోజనాలను, ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాజధాని విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. అంతేకాకుండా ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ ఇష్టానుసారంగా రాజధానిని మార్చేయకుండా రాజ్యాంగంలో చట్టం తీసుకురావాలని ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు.
అమరావతి నుంచి రాజధాని రైతుల పాదయాత్ర అరసవెల్లికి చేరుకుంటుందా? లేదా? అనేది అనుమానంగా ఉంది. తణుకులో అడ్డుకున్నారు.. అమరావతి రైతుల పాదయాత్రను టీడీపీ యాత్రగా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. విశాఖ కేంద్రంగా నడుస్తున్న వికేంద్రీకరణ ఉద్యమం వైసీపీ నడిపిస్తోందనీ, ప్రాంతాల మద్య చిచ్చుపెట్టేందుకే ఈ ప్లాన్ అని టీడీపీ ఆరోపిస్తుంది. తణుకులో అమరావతి పాదయాత్రకు మద్దతుగా జనసేన కార్యకర్తలు మద్దతు పలికారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్లకార్డులతో అమరావతికి వ్యతిరేకంగా ప్రదర్శన తీశారు. ఇక పాదయాత్ర ముందుకు సాగే కొద్ది వైసీపీనేతలు అడుగడునా ఆటంకాలు కలిగించాలని చూస్తున్నారని టీడీపీ ఆరోపిస్తుంది.
వైజాగ్ లో ఈనెల 15న భారీ ర్యాలీ, బహిరంగసభకు వికేంద్రీకరణ జేఏసీ ప్లాన్ చేసింది. ఇక తునిలో ఈ యాత్రకు ఫుల్ స్టాఫ్ పెట్టించాలని మంత్రి దాడిశెట్టి రాజా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, రాజధానుల గోడవలో పడి ఆంధ్ర డెవలప్మెంట్ ను మళ్లీ వెనక్కి నెట్టేస్తున్నారనే వారూ లేకపోలేదు. అయితే ప్రస్తుత ఈ తరుణంలో మరోసారి రాజధాని అంశం వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి లబ్ది చేకూర్చుతుంది..ఏ పార్టీని అధికారంలోకి తెస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.