Crime News :  శవాల మీద పేలాలు ఏరుకునేవాళ్లు ఉంటారు. నిజంగా అలా చేసే వాళ్లు ఉన్నా.. అంత కంటే దారుణంగా ప్రవర్తించే మోసగాళ్లు కూడా ఉన్నారు. అసలే కుటుంబంలోని వ్యక్తులు చనిపోయి బాధల్లో ఉంటే.. వారికి సాయం చేస్తామంటూ నమ్మించి వారి వద్ద ఉన్న డబ్బు, దస్కం అంతా మూటగట్టుకుని పోయేవాళ్లు కూడా ఉంటారు. ఇలాంటి మోసాలు ఇప్పుడు ఆన్ లైన్ అయ్యాయి. కడప జిల్లాలో ఇలా ఓ మోసగాడు పెద్ద సంఖ్యలో కోవిడ్ బాధిత కుటుంబాల్ని మోసం చేశాడు.  ప్రభుత్వ ఉద్యోగులు కూడా వారికి తెలియకుండానే ఆ మోసంలో భాగస్వాములయ్యారు. 


వైఎస్ఆర్ బీమా వస్తుందని బ్యాంక్ అకౌంట్ వివరాల సేకరణ


ఇటీవల కేంద్రం కరోనాతో మృతి చెందిన వారికి ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది. అలాగే ఏపీలో వైఎస్ఆర్ బీమా పేరుతో ఓ పథకం అమలవుతోంది. ఈ బీమా కింద చనిపోయిన వారికి రూ. ఐదు లక్షలు ఇస్తారు. ఈ రెండు అంశాలను ఆధారం చేసుకుని ఓ ముఠా కడప జిల్లాలో కరోనా కారణంగా మృతి చెందిన వారి ఇళ్లకు వెళ్లింది. కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి వివరాలను స్థానిక ఆరోగ్య కార్యకర్తల నుంచి సేకరించారు. వారి ఇళ్లకు వెళ్లి తాము ప్రభుత్వ కోసం పని చేస్తున్నామని..వైఎస్ఆర్ బీమా కింద నగదు జమ చేస్తామని.. తమకు ఒక్క రూపాయి కూడా ఇవ్వవొద్దని బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇస్తే చాలని నమ్మబలికారు. 


మొత్తం బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేసిన మోసగాడు 


మోసగాళ్లతో పాటు ఆరోగ్య కార్యకర్తలు కూడా ఉండటం...  కుటుంబసభ్యుడు కరోనాతో చనిపోయి  బాధల్లో ఉన్న తమకు ఎంతో కొంత సాయం వస్తుందన్న ఆశతో కుటంబసభ్యులు..  బ్యాంక్ ఖాతాలు ఇతర వివరాలు ఇచ్చారు. అయితే ఆ వివరాలతో బ్యాంక్ అకౌంట్లలో ఉన్న డబ్బులన్నింటినీ కాజేశారు. దీంతో లబోదిబోమన్న బాధితులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ఈ  వ్యవహారంలో కడప జిల్లా ఖాజీపేట కు చెందిన వెంకటేశ్ ను పోలీసులు అరెస్టు చేశారు. వైయస్సార్ భీమా పేరుతో ఇలా మోసం చేస్తూ లక్షలాది రూపాయలను 9 బ్యాంకు అకౌంట్లలో ఉన్నట్లు కడప వన్ టౌన్,సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. దీంతో ఆ అకౌంట్ల లోని ఏడు లక్షల 35 వేల రూపాయల నగదును  ప్రీజ్ చేసినట్లు జిల్లా ఎస్పీ కేకే అన్బు రాజన్ మీడియాకు వెల్లడించారు. 


స్పందనలో ఫిర్యాదులతో  చర్యలు తీసుకున్న పోలీసులు


బాధితులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. స్పందనలో బాధితుల పిర్యాదు తో వైఎస్ఆర్ బీమా పేరుతో మోసం చేస్తున్న  వ్యవహారం పై దర్యాప్తులో ఈ మోసం వెలుగు చూసిందని ఎస్పీ వెల్లడించారు. ప్రభుత్వం ఎలా ఫోన్ చేసి, అకౌంట్లలో డబ్బులు ఉంచాలని ఇాచెప్పాదని, ప్రజలు ఇలాంటి మోసపూరిత కాల్స్ నమ్మ వద్దని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఎవరైనా బాధితులు ఉంటే పిర్యాదు చేయాలని కోరారు. కరోనాతో బాధితులైతే... ఇలా ఆన్ లైన్ మోసాల కారణంగా మరోసారి బాధితులు కావడం.. ఆర్థికంగా నష్టపోవడం ఆ కుటుంబాలకు నరకయాతనగా మారింది.