Hindi Row : ఐఐటీల్లోనూ హిందీ మీడియం మాత్రమే ఉండేలా కేంద్రం కొత్త ఆలోచనలు చేయడం వివాదాస్పదమవుతోంది. దేశ అధికార భాషకు సంబంధించి.. కేంద్రమంత్రి అమిత్ షా నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ గతంలో చేసిన సిఫార్సులు వివాదాస్పదమయ్యాయి. భారతీయులకు ఇంగ్లీష్‌ని దూరం చేయడమే లక్ష్యంగా.. విద్యాసంస్థల్లో హిందీ మీడియం మాత్రమే ఉండేలా.. ప్రభుత్వ ఆఫీసుల్లో వ్యవహారాలు, ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ హిందీలోనే జరిగేలా.. అమిత్ షా కమిటీ చేసిన ప్రతిపాదనలు చేసింది. దీనిపై దక్షిణాది రాష్ట్రాల్లో విమర్శలు ప్రారంభమయ్యాయి. భాషను ఎంచుకునే హక్కు ప్రజలకే ఉండాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ఐఐటీలు, కేంద్రప్రభుత్వ ఉద్యోగాల్లో హిందీని మాత్రమే అమలు చేయాలని నిర్ణయం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నానని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
అన్ని భాషలపై వేటు వేయడమేనని దక్షిణాది రాష్ట్రాల ఆగ్రహం
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇదే విషయమై ప్రధాని మోదీకి లేఖ రాశారు. "కేవలం ఓ భాషను మాత్రమే ఎక్కువగా ప్రమోట్ చేసి, దాన్ని అందరిపైనా బలవంతంగా రుద్దాలన్న ప్రయత్నం మానుకోండి. ఇది సమైక్యతకు వ్యతిరేకం" అని స్పష్టం చేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా అన్ని భాషలపై ఒకే సారి వేటు వేయడం లాంటిదేనన్నారు. దీనిపై ఇతర రాష్ట్రాల్లోనూ వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అమిత్ షా ఆ కమిటీ మొత్తం 112 సిఫారసులతో.. తన 11వ నివేదికను.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. టెక్నికల్, నాన్ టెక్నికల్ విద్యాసంస్థలతో పాటు సెంట్రల్ యూనివర్సిటీల్లోనూ.. హిందీ మీడియమే ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. దేశవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో ఇంగ్లీష్‌ను ఆప్షనల్‌గా మార్చాలని ప్రతిపాదించారు.
హిందీలో ఉన్నత విద్య అంటే దక్షిణాది ప్రాంతాలకు తీరని నష్టం
టెక్నికల్ ఇన్‌స్టిట్యూషన్స్ అయిన ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్, నాన్ టెక్నికల్ ఇన్‌స్టిట్యూషన్స్ అయిన కేంద్రీయ, నవోదయ విద్యాలయాల్లో.. హిందీ మీడియం మాత్రమే అమలు చేయాలని అమిత్ షా కమిటీ ప్రతిపాదించింది. కేవలం.. తప్పనిసరి అనుకున్న కొన్ని ప్రాంతాల్లో మాత్రమే.. ఇంగ్లీష్ మీడియాన్ని కొనసాగించాలని.. అక్కడ కూడా నెమ్మదిగా ఇంగ్లీష్ స్థానంలో హిందీని భర్తీ చేయాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం ఉద్యోగ నియామకాలకు నిర్వహించే పరీక్షల్లో.. తప్పనిసరిగా ఉన్న ఇంగ్లీష్ స్థానంలో.. హిందీ పేపర్‌ను కంపల్సరీ చేయాలని ప్రతిపాదించారు. ఎంపిక చేసే ఉద్యోగులకు కూడా హిందీపై అవగాహన ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. హైకోర్టు ఆదేశాల్లోనూ హిందీ అనువాదం ఉండేలా చూడాలని.. తీర్పులు కూడా హిందీలోనే ఇచ్చే అవకాశం కల్పించాలని కమిటీ సిఫారసు చేసింది.
వ్యతిరేకతను కేంద్రం పట్టించుకుంటుందా ?
పార్లమెంటరీ కమిటీ ఇచ్చిన రిపోర్టుపై... హిందీయేతర రాష్ట్రాల్లోనే కాదు విద్యారంగ నిపుణుల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇంగ్లీష్ లేకపోతే.. పోటీ ప్రపంచాన్ని తట్టుకోవడం సాధ్యం కాదని విద్యార్థులు, లెక్చరర్లు, విద్యా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సబ్జెక్ట్ ఉండి.. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేక.. ఎంతోమంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని చెబుతున్నారు. ప్రపంచంతో పోటీ పడే నిర్ణయాలు తీసుకోవాలి గానీ.. భావి పౌరుల జీవితాలతో ఆడుకోవడం ఏమిటని.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విమర్శలపై కేంద్రం ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు.