ఆరోజు వైశ్రాయ్ హోటల్ వద్ద అసలేం జరిగింది.. ఎన్టీఆర్ ని చంద్రబాబు కాళ్లు పట్టుకుని బతిమిలాడారా, కాళ్లు పట్టుకు లాగి కింద పడేశారా..? వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చెబుతున్నదేంటి..? అసలు అన్ స్టాపబుల్ షో లో చంద్రబాబు ఏం చెప్పారు..?


బాలకృష్ణ అన్ స్టాపబుల్ సీజన్-2 కోసం చంద్రబాబుతో చేసిన ఎపిసోడ్ ప్రోమో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వైరల్ గా మారింది. తన బెస్ట్ ఫ్రెండ్ వైఎస్ఆర్ అంటూ చంద్రబాబు చెప్పడం, వైశ్రాయ్ హోటల్ విషయంలో ఎన్టీఆర్ కాళ్లు పట్టుకున్నానని చెప్పడం చర్చనీయాంశమయ్యాయి. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఆరోజు ఎన్టీఆర్ తోపాటు ఆయన పక్కనే ఉన్న 14మంది ఎమ్మెల్యేలలో తాను కూడా ఒకడినని చెప్పారు ప్రసన్న. చంద్రబాబు ఎన్టీఆర్ కాళ్లు పట్టుకోలేదనడానికి తానే ప్రత్యక్ష సాక్షిని అన్నారు. ఆయన కాళ్లు పట్టుకుని ఎన్టీఆర్ ని పడగొట్టారని ఎద్దేవా చేశారు. కుటుంబ సభ్యులంతా ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా చంద్రబాబుతో చేతులు కలిపారని, ఆయన్ను మానసికంగా చంపేశారని అన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి. 


ఎన్టీఆర్ ని పార్టీనుంచి వెళ్లగొట్టే సమయంలో కొంతమంది ఎమ్మెల్యేలు చంద్రబాబుకి మద్దతుగా రాగా, మరికొంతమంది ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ తోనే ఉన్నారు. 14మంది ఆయనతో మిగిలిపోయారు. ఆ మిగిలిన వారిలో నల్లపురెడ్డి ప్రసన్న కూడా ఒకరు. వైశ్రాయ్ హోటల్ ఘటన నుంచి ఎన్టీఆర్ చనిపోయ్ వరకు తామంతా ఆయనతోనే ఉన్నాయని చెబుతున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి. చంద్రబాబు ఎప్పుడూ ఎన్టీఆర్ వద్దకు రాలేదని, లక్ష్మీపార్వతిని పక్కనపెట్టండి, మీరే ముఖ్యమంత్రిగా కొనసాగండి అని చెప్పలేదని వివరించారు ప్రసన్న. పెద్దాయన మీద చెప్పులేశారని, రాళ్లు వేయించారని అన్నారు. ఎన్టీఆర్ లో ప్రజలంతా దేవుడిని చూసుకుంటారని, ఆయన మంచి మనిషి అని, పసిబిడ్డ మనస్తత్వం ఆయనది అని చెప్పారు ప్రసన్న. చంద్రబాబుది నీఛమైన మనస్తత్వం అని, ఆయన దుర్మార్గుడని, రాక్షసుడని, నరం నరం విషంతో నిండిపోయి ఉన్నారని మండిపడ్డారు. నమ్మి ఆడబిడ్డను ఇస్తే మామ గొంతు కోశాడని చెప్పారు ప్రసన్న. 


బాలకృష్ణ వాటా కూడా ఉంది..
ఆరోజు జరిగిన తప్పులో బాలకృష్ణకు కూడా వాటా ఉందని చెప్పారు ఎమ్మెల్యే ప్రసన్న. వైశ్రాయ్ హోటల్ లో కుటుంబం అంతా ఒకటైపోయి ఎన్టీఆర్ కి ద్రోహం చేశారన్నారు. ఈరోజు మళ్లీ ప్రజల ఓట్లకోసం ఆయనకే భజన చేస్తున్నారని చెప్పారు. ఎన్టీఆర్ కాళ్లు పట్టుకోడానికి చంద్రబాబు రాలేదని, అదంతా పచ్చి అబద్ధమని, ఆరోజు తామంతా అక్కడే ఉన్నామని చెబుతున్నారు ప్రసన్న. 


అలా బ్లాక్ మెయిల్ చేశారు.. 
వాస్తవానికి అప్పట్లో చంద్రబాబు వెంట ఎవరూ లేరని, కానీ ఈనాడులో ఎమ్మెల్యేలు చంద్రబాబు వెంట వచ్చేస్తున్నారు, అందరూ బయటకెళ్లిపోతున్నారు, బాబుకే జై కొడుతున్నారంటూ ఊదరగొట్టారని, అలా బ్లాక్ మెయిల్ చేసి అందర్నీ వైశ్రాయ్ హోటల్ కి తెప్పించారని చెప్పారు ప్రసన్న. చంద్రబాబుకి ఆయన తండ్రి ఖర్జూర నాయుడు 2 ఎకరాలు మాత్రమే ఇచ్చారని, కానీ ఇప్పుడు బాబు 4లక్షల కోట్లకు అధిపతి అయ్యారని చెప్పారు. ఇదంతా ఎక్కడినుంచి సంపాదించారని ప్రశ్నించారు. 


ఎన్టీఆర్ ని సీఎం కుర్చీనుంచి దింపేసిన ఘోస్ట తగిలి చంద్రబాబు ఇప్పుడు ఈ స్థాయికి దిగజారారని చెప్పారు ప్రసన్న. తప్పు చేసినవారిని దేవుడు వదిలిపెట్టడని, ఎన్టీఆర్ పై చెప్పులు వేయించడం వల్లే చంద్రబాబు శిక్ష అనుభవిస్తున్నారని అన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి. బాబు సీఎం అయ్యాక టీడీపీ మెంబర్షిప్ పుస్తకాల్లో ఎన్టీఆర్ ఫొటోలు కూడా వద్దన్నారు. అభిమానులు తిరుగుబాటు చేస్తే తిరిగి పెద్దాయన ఫొటో ప్రింట్ చేశారని ఆనాటి ఘటనలు గుర్తు చేసుకున్నారు ప్రసన్న.