Gujarat Elections 2022: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు భాజపా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ టిక్కెట్లు నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన ఏడుగురు పార్టీ నాయకులను భాజపా సస్పెండ్ చేసింది.


ఆరేళ్లు


పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఏడుగురు ఎమ్మెల్యేలను ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలైన వీరంతా టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్‌ దాఖలు చేశారు. దీంతో క్రమశిక్షణా రాహిత్యం కింద పార్టీ కఠిన చర్యలు తీసుకుంది.


వీరే



  1. హర్షద్ వాసవ

  2. అరవింద్ లదాని

  3. ఛత్రాసింగ్ గుంజారియా

  4. కేతన్ భాయ్ పటేల్

  5. భరత్ భాయ్ చావ్‌డా

  6. ఉదయ్‌ భాయ్ షా

  7. కరన్ భాయ్ బరైయా


వీరంతా డిసెంబర్ 1న జరిగే తొలి విడత ఎన్నికల్లో సిట్టింగ్ స్థానం నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేశారు.


రానున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు భాజపా తమ అభ్యర్థులను ఇటీవల ప్రకటించింది. 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 160 మంది అభ్యర్థులను భాజపా ప్రకటించింది. భాజపా అభ్యర్థుల జాబితాలో 38 కొత్త ముఖాలు ఉన్నాయి. 69 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ పోటీ చేసేందుకు టిక్కెట్లు ఇచ్చారు.


భాజపా అభ్యర్థుల జాబితాలో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తన నియోజకవర్గం ఘట్లోడియా నుంచి బరిలోకి దిగారు. విరామ్‌గాం నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ మాజీ నేత హార్దిక్‌ పటేల్‌కు భాజపా టికెట్‌ ఇచ్చింది. మరోవైపు క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాకు భాజపా అసెంబ్లీ టికెట్ ఇచ్చింది. గుజరాత్ జామ్‌నగర్ నార్త్ విధానసభ స్థానం టికెట్ ఆమెకు ఇచ్చింది.


ఇటీవల బ్రిడ్జి కూలిన ఘటనలో ప్రజలను రక్షించేందుకు నదిలో దూకిన మోర్బీ మాజీ ఎమ్మెల్యే కాంతిలాల్ అమృత్యను కూడా భాజపా రంగంలోకి దించింది.


ఎన్నికల షెడ్యూల్


ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించింది. గుజరాత్‌లోని మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు జరపనున్నట్లు ఈసీ ప్రకటించింది. గుజరాత్ శాసనసభ పదవీకాలం 2023, ఫిబ్రవరి 18తో ముగియనుంది.


డిసెంబర్ 1న గుజరాత్ తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 5న రెండో విడత పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న కౌంటింగ్, ఫలితాలు వెల్లడించనుంది.


2017లో


గుజరాత్‌లో ప్రస్తుతం భాజపా ప్రభుత్వం అధికారంలో ఉంది. గుజరాత్‌లో 182 శాసనసభ స్థానాలుండగా.. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి 99 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌ 77 స్థానాలు సాధించింది. ఆ తర్వాత రాష్ట్రంలో పలుమార్లు ఉప ఎన్నికలు జరగడంతో ప్రస్తుతం కాషాయ పార్టీ బలం 111కు పెరిగింది.


Also Read: Viral Video: అదృష్టం బాగుంది- కుక్కల నుంచి త్రుటిలో తప్పించుకున్న చిన్నారి!