MP GVL Narsimharao : శ్రీరాముడు తనొక్కడే వెళ్లి రావణుడిని చంపలేడా? అయినా.. హనుమంతుడు, విభీషణుడు, ఉడతా ఇలా అందరినీ సాయం తీసుకున్నది లోక కల్యాణం కోసమే. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కల్యాణం కోసం చంద్రబాబు నాయుడు అలాంటి ఆలోచనే చేయాలని అయ్యన్నపాత్రుడు అన్నారు.  శ్రీరాముడితో చంద్రబాబును పోలుస్తూ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఖండించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

  






లోకేశ్ కల్యాణార్థం కోసమే 


"భగవంతుడైన శ్రీరాముడితో తమ నాయకుడు చంద్రబాబును పోలుస్తూ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే సహించేది లేదు. ఇతర పార్టీల పొత్తు కోసం పరితపిస్తూ ఈ బిల్డప్ ఏంటి? మీ నాయకుడి ఆరాటం "లోక"కల్యాణం కోసం కాదు. "లోకేశ్"కల్యాణార్థం అని అందరికీ తెలుసు."  అంటూ ట్వీట్ చేశారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు. 


అయ్యన్నపాత్రుడు ఏమన్నారంటే? 


ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థులను ముందే ప్రకటించాలని టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కోరారు. సరిగ్గా పని చేయని వారికి టికెట్ ఇవ్వబోమని చంద్రబాబు నిర్మొహమాటంగా ప్రకటించేయాలని అభిప్రయాపడ్డారు. ఒకవేళ తాను గెలవలేను అనే అభిప్రాయం ఉన్నాసరే టికెట్ ఇవ్వొద్దని చెప్పారు. టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. శ్రీరాముడు తనొక్కడే వెళ్లి రావణుడిని చంపలేడా? అయినా.. హనుమంతుడు, విభీషణుడు, ఉడతా ఇలా అందరినీ సాయం తీసుకున్నది లోక కల్యాణం కోసమే. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కల్యాణం కోసం చంద్రబాబు నాయుడు అలాంటి ఆలోచనే చేయాలని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.  


'ఇదేం ఖర్మ.. రాష్ట్రానికి?' అని మార్చాలి


"9 ఎన్నికల్లో పోటీ చేశా.. 6 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలుపొందా.. రెండు సార్లు ఓడిపోయా.. నాకు ప్రజల నాడి తెలుసు. ఇప్పటికే ప్రజల్లో ట్రెండ్ మారిపోయింది. ఈ దుర్మార్గ పాలన వద్దు అని ప్రజలు అంటున్నారు. చంద్రబాబు నాయుడిని గెలిపిస్తామని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీదే విజయం. అందుకే అభ్యర్థులను ముందే నిర్ణయించాలి. సరిగ్గా పని చేయని వారికి టికెట్ ఇవ్వబోమని చంద్రబాబు మొహమాటం లేకుండా చెప్పాలి" అని అయ్యన్నపాత్రుడు అన్నారు. "తప్పు జరుగుతున్నప్పుడు తప్పు అని టీడీపీ నాయకులు అంతా 175 నియోజకవర్గాల్లో గట్టిగా నిలదీసి నిలబడాలి. కింది స్థాయికి వెళ్లే వరకు మాట్లాడుతూనే ఉండాలి. అలాగే 'ఇదేం ఖర్మ' పేరులోనూ కొన్ని మార్పులు చేయాలి. దానిని 'ఇదేం ఖర్మ.. రాష్ట్రానికి?' అని మారిస్తే బాగుంటుంది" అని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.