Cow in ICU Ward:


మధ్యప్రదేశ్‌లో ఘటన..


వైద్య రంగంలో ఎన్ని మార్పులు వచ్చినా..ఎంత కొత్త టెక్నాలజీ వచ్చినా..కనీస వసతుల విషయంలో మాత్రం ప్రభుత్వ ఆసుపత్రులు ఇంకా తప్పటడుగులు వేస్తూనే ఉన్నాయి. ఎన్ని దుర్ఘటనలు జరిగినా..ఎన్ని ప్రాణాలు పోయినా..నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. అందుకే... గవర్నమెంట్ హాస్పిటల్ అంటే జనాలు అంతగా భయపడిపోతున్నారు. కొన్ని చోట్ల కాస్తో కూస్తో వసతులు మెరుగు పడినా...ఇంకా కొన్ని చోట్ల మాత్రం సమస్యలు తీరటం లేదు. "హాస్పిటల్‌కు వెళ్తే ఉన్న రోగం పోవడమేమో కానీ..కొత్త రోగాలు వచ్చేలా ఉన్నాయి" అని కొందరు అసహనం వ్యక్తం చేస్తుంటారు. అలా ఉంటుంది...ఆ ఆసుపత్రుల నిర్వహణ. అప్పుడప్పుడూ గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో ఇబ్బందులకు సంబంధించిన వీడియోలు వెలుగు చూస్తూనే ఉంటాయి. ఇప్పుడు అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గర్‌లో జిల్లా ఆసుపత్రిలో షాకింగ్ సంఘటన జరిగింది. ఓ ఆవు ఏకంగా ICU వార్డ్‌లోకి వెళ్లింది. అక్కడి మెడికల్ వేస్ట్‌ని తింటూ కనిపించింది. సెక్యూరిటీ సిబ్బంది అందుబాటులో ఉన్నప్పటికీ...ఆవు అలా లోపలకు వచ్చి తిరగటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆవులు ఇలా లోపలకు రాకుండా ఉండేందుకు ప్రత్యేకంగా ఇద్దరిని నియమించుకున్నారు. అయినా...ఆవు లోపలకు వచ్చేసింది. ఇది గమనించిన ఓ వ్యక్తి ఆవు ICU వార్డ్‌లో మెడికల్ వేస్ట్ తింటుండడాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. ఈ వీడియో వైరల్ అయిన వెంటనే...హాస్పిటల్‌లోని సెక్యూరిటీ గార్డ్‌తో పాటు ఇద్దరు సిబ్బందిని తొలగించారు.






"నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై మేము కఠిన చర్యలు తీసుకున్నాం. వార్డ్‌బాయ్‌తో పాటు సెక్యూరిటీ గార్డ్‌ని విధుల్లో నుంచి తొలగించాం. కొవిడ్ సమయంలో వినియోగించిన ICU వార్డ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది" అని డాక్టర్ రాజేంద్ర కటారియా వివరించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు మండి పడుతున్నారు. "ఇది నిజంగానే హాస్పిటలేనా..? ఆవులు అంత ఫ్రీగా లోపలకు వచ్చేస్తున్నాయ్" అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు బీజేపీ ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నారు.