కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల తరహాలోనే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సర్వం సిద్ధం చేస్తోంది. గత మూడేళ్లుగా అమ్మవారి బ్రహ్మోత్సవాలు కరోనా నేపథ్యంలో ఏకాంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా పూర్తిగా నియంత్రణ అయిన కారణంగా ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించాలని టీటీడీ ఉన్న నిర్ణయించింది. ఈ నెల 20 ఉదయం ధ్వజారోహణంతో‌ ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.  


ఈ సందర్భంగా అమ్మవారి వారి ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు, మాడవీధులు రంగులు వేసి, విద్యుత్ దీపాలు, దేవతామూర్తుల ప్రతిమలు ఏర్పాటు చేసింది టీటీడీ. తిరుపతి నుండి తిరుచానూరుకి వచ్చే మార్గంలో స్వాగత ఆర్చులు ఏర్పాటు చేశారు. 28వ తేది ఉదయం అత్యంత పవిత్రమైన, విశిష్టమైన పుష్కరిలో పంచమి తీర్థానికి ఇతర రాష్ట్రాల నుండి అలాగే పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివస్తారు. అందుకు అనుగుణంగా క్యూలైన్లు, అన్న ప్రసాదాలు తదితర ప్రత్యేక ఏర్పాట్లు టీటీడీ చేస్తున్నారు.  


9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు


తొమ్మిది రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలలో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు జరుగుతాయి. అలాగే సాయంత్ర వేళల్లో 7 గంటల నుండి 9 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయి. ఇక పంచ‌మితీర్థం రోజు భ‌ద్ర‌తా విధుల‌కు 2500 మంది పోలీసుల‌ను వినియోగించనుంది. టీటీడీలోని అన్ని విభాగాలు స‌మ‌న్వయంతో భక్తులకు‌ సేవలందించే‌ విధంగా టీటీడీ ఈవో‌ ఏవి.ధర్మారెడ్డి చర్యలు తీసుకున్నారు.


20వ తేదీ ఆదివారం ఉదయం ధ్వజారోహణ కార్యక్రమంను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు‌. ఆదివారం రాత్రి చిన్న శేషవాహనంపై పద్మావతి అమ్మవారు ఆశీస్సులు కానున్నారు.


21వ తేదీ సోమవారం ఉదయం పెద్దశేషవాహనం, రాత్రి హంసవాహనంపై అమ్మవారు ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. 22వ తేదీన‌ మంగళవారం ఉదయం ముత్యపు పందిరి వాహనంపై, రాత్రి సింహ వాహనంపై మాఢవీధుల్లో‌ విహరించనున్నారు.


23వ తారీఖు బుధవారం ఉదయం కల్పవృక్ష వాహనంపై, రాత్రి హనుమంత వాహనంపై, 24వ తేదీ గురువారం ఉద పల్లకీ ఉత్సవం పై, రాత్రి గజవాహనంపై, 25వ తేదీన శుక్రవారం ఉదయం సర్వభూపాల వాహనం, సాయంత్రం స్వర్ణరథం, రాత్రి గరుడ వాహనం, 26వ శనివారం ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనంపై, 27వ ఆదివారం ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వ వాహనంపై, 28వ తేదీన సోమవారం పంచమీతీర్థంను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. అదే రోజు‌ సాయంత్రం‌ ధ్వజావరోహణం కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు నిర్వహించడంతో పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయని పద్మావతి అమ్మవారి ఆలయం ప్రధాన అర్చకులు బాబు స్వామి తెలిపారు.


తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ


శ్రీనివాసుడి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం 19-11-22న స్వామి వారిని 79,471 మంది దర్శించుకోగా, 36,594 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. ఇక స్వామి వారికి భక్తులు కానుకల హుండీ రూపంలో 4.90 కోట్ల రూపాయలు లభించింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 24 కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి‌ ఉన్నారు. దీంతో స్వామి వారి సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు 24 గంటల సమయం పడుతుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనంకు దాదాపు మూడు గంటల సమయం పడుతుంది..