Annamayya Dam Collapse: అన్నమయ్య డ్యాం ప్రమాదం జరిగి ఏడాది గడిచినా ఏపీ ప్రభుత్వం బాధితులకు ఎలాంటి సాయం అందించలేదన్నారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. మూడు నెలల్లో అన్నమయ్య ప్రాజెక్టు నిర్వాసితులకు ఇళ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చిన సీఎం వైఎస్ జగన్ ఏడాది నుంచి కనిపించడం లేదన్నారు. సొంత జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీనే నిలబెట్టుకోలేని జగన్ సీఎం పదవిలో కొనసాగే అర్హత కోల్పోయారని చెప్పారు. నెల రోజులలోపు రాష్ట్ర ప్రభుత్వం నిర్వాసితులను ఆదుకోకపోతే కలెక్టరేట్ ముట్టడిస్తామని నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు.
తిరుపతి మీడియా సమావేశంలో అన్నమయ్య డ్యాం నిర్వాసితుల సమస్యలను జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రస్తావించారు. అన్నమయ్య డ్యాం ప్రమాదం మానవ తప్పిదమో? ప్రకృతి వైపరీత్యామో సీఎంకు తెలుసునన్నారు. జల ప్రళయానికి కారణం తెలిసినా ముఖ్యమంత్రి యాక్షన్ ఎందుకు తీసుకోవడం లేదు, ఎంక్వైరీ రిపోర్టును ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. అన్నమయ్య డ్యాం ప్రమాదంలో 44 మంది ప్రాణాలు కోల్పోగా, పంట పొలాలు, పశువులు బలైపోయాయి. ఈ విషాదం జరిగి ఏడాది పూర్తవుతున్నా బాధితులకు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయిందని నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ఈ ప్రాంతంలో స్వయంగా సీఎం జగన్ పర్యటించి.. బాధితులకు మూడు నెలల్లో ఇళ్లు కట్టించి ఇస్తాం, నేనే వచ్చి తాళాలు అందిస్తానని చెప్పారని.. కానీ ఏడాది పూర్తయినా సీఎం కనిపించడం లేదని ఎద్దేవా చేశారు.
జనసేన పర్యటనతో ప్రభుత్వం హడావుడి..
అన్నమయ్య డ్యాం ప్రమాదం జరిగిన ప్రాంతల్లో జనసేన పర్యటిస్తుందని తెలుసుకోగానే హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ రాత్రికి రాత్రే నిర్వాసితుల ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.1 లక్షా 40 వేలు వేస్తామని చెప్పారు. 5 సెంట్ల ఇంటి స్థలంలో ఎక్కడో కొండ ప్రాంతంలో ఇచ్చి 434 ఇళ్లను ప్రభుత్వం కట్టిస్తోందని, రూ.5 లక్షలు ఇస్తే తాము ఇక్కడే ఇళ్లు కట్టుకుంటామని బాధితులు వేడుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. త్వరలోనే బాధితులకు అవసరమైన నిత్యావసర వస్తువులు అందించడంతో పాటు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తామన్నారు.
ఏడాదిలోనే రూ.300 కోట్లు అంచనా పెంచేశారు
అన్నమయ్య డ్యాం ప్రమాదం జరిగి ఏడాది పూర్తయినా నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణం పునాది స్థాయి కూడా దాటలేదన్నారు. బాధిత ప్రాంతాల్లో మహిళలకు పెన్షన్ అందడం లేదు. జాబ్ మేళా ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చినా, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. కరెంట్ స్తంభం ఏర్పాటు చేయడానికి రూ.4 వేలు లంచం అడుగుతున్నారని, సర్వం కోల్పోయిన వారి దగ్గర సైతం దోచుకోవడానికి సిగ్గుండాలన్నారు. గతంలో రూ.468 కోట్ల వ్యయంతో డ్యామ్ నిర్మాణం చేపడతామని ఏపీ ప్రభుత్వం చెప్పింది. కానీ ఏడాది వ్యవధిలో అంచనా వ్యయం రూ.300 కోట్లు పెంచేసి రూ.757 కోట్లు చేశారని నాదెండ్ల మనోహర్ ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ కు మాత్రమే భవనం కట్టారు గానీ, బాధితులకు ఒక్క ఇళ్లు కట్టకుండా ఒక్క ఏడాదిలోనే రూ.300 కోట్లు అంచనా వ్యయం ఎలా పెరిగిందో ఏపీ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో డా.హరిప్రసాద్, కిరణ్ రాయల్, రాందాస్ చౌదరి, రాజారెడ్డి, మనుక్రాంత్ రెడ్డి, తాతంశెట్టి నాగేంద్ర, ఆకేపాటి సుభాషిణి, వినుత కోట, కళ్యాణం శివ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.