- సుండుపల్లె నుండి తమిళనాడుకు ఎర్రచందనం అక్రమ రవాణా
- తొమ్మిది మంది ఎర్రచందనం కూలీలు అరెస్టు
- యాభై లక్షలు విలువ చేసే 46 దుంగలు స్వాధీనం
అన్నమయ్య జిల్లాలో ఎర్ర చందనం అక్రమ రవాణాపై పోలీసులు నిఘా పెంచారు. ఈ క్రమంలో సుండుపల్లి వద్ద నుండి ఎర్ర చందనం దుంగలను వి.కోట మీదుగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఎర్ర చందనం అక్రమ రవాణా చేస్తున్న తమిళనాడుకు చెందిన 9 మంది కూలీలను అరెస్టు చేసినట్లు పలమనేరు డీఎస్పీ సధాకర్ రెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి ఆదేశాల మేరకు వి.కోట ఎస్సై రాంభూపాల్ నేతృత్వంలో పోలీసులు దానయ్య గారి పల్లె వద్ద నాకా బందీ నిర్వహిస్తుండగా వచ్చిన వాహనం ఆపగా డ్రైవర్ పరారయ్యాడు. అందులో ఉన్న 9 మందిని అదుపులోకి తీసుకుని విచారించగా ఎర్ర చందనం అక్రమ రవాణాగా బహిర్గతమైంది. 
వి.కోటకు చెందిన ప్రధాన స్మగ్లర్ తమిళనాడుకు చెందిన కూలీలను తరలించి సుండుపల్లె వద్ద నుండి ఎర్రచందనాన్ని రహస్యంగా తమిళనాడు రాష్ట్రం క్రిష్ణగిరికి తరలించేవారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారు జామున దానమయ్యగారిపల్లె వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఎర్రచందనం తరలిస్తున్న వాహనం గుర్తించి అడ్డుకున్నారు. ఇందులో తమిళనాడు రాష్ట్రం తిరువణామలై పరిసరాలకు చెందిన దొరైస్వామి, శంకర్, రమన్, సెల్వం, తంగరాజ్, ఏలుమలై, ప్రకాష్, మాసలమలై, సుబ్రమణిలుగా గుర్తించినట్లు చెప్పారు. నిందితుల వద్ద టన్ను బరువున్న రూ. 50 లక్షలు విలువ జేసే 46 ఎర్రచందనం దుంగలు.. కె ఏ 51 - 3720 నంబరు గల టాటా 207 వాహనాన్ని సీజ్ చేశారు. నిందితులను రిమాండుకు తరలించి కేసు నమోదు చేస్తున్నట్లు డీఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపారు.


పెండ్లి వారమంటూ పోలీసులకు టోకరా! 
పెండ్లీ వారంమండీ అంటూ బస్సు ఎక్కి పోలీసులకు టోకరా కొట్టి కొన్ని నెలల కిందట తమిళనాడుకు చెందిన ఎర్రచందనం కూలీలు తప్పించుకున్నారు.. అసలు పోలీసుల నుండి 36 మంది స్మగ్లర్స్ ఎలా తప్పించుకున్నారు. వివరాల్లోకి వెళతే... తిరుపతి నుండి తమిళనాడు రాష్ట్రం, తిరుపత్తూర్‌‌కు TN 23 N 2327 తమిళనాడు ఆర్టీసీ బస్సు బయలుదేరింది. తిరుపతి నుండి బయలుదేరిన ఆ బస్సులో డ్రైవర్, కండక్టర్ కాకుండా 36 మంది తమిళనాడుకు చెందిన వారు పెళ్లి బృందంగా ప్రయాణిస్తున్నారు. ఇంతలో పోలీసులకు వచ్చిన రహస్య సమచారం మేరకు ఆ బస్సును వెతికే పనిలో పడ్డారు చంద్రగిరి పోలీసులు. చివరికి బస్సు ఆచూకీ గుర్తించారు. బస్సు వెళ్ళే మార్గంలో పోలీసు వాహనం వస్తుంది. పోలీసు వాహనం వస్తుందని సమాచారం అందుకున్న బస్సు డ్రైవర్ అప్రమత్తం అయ్యి బస్సును మరింత వేగంగా నడిపారు.. పోలీసుల నుండి తప్పించుకునేందుకు అతివేగంగా వెళ్లి చంద్రగిరికి సమీపంలోని తన్నుపల్లె క్రాస్ వద్ద బస్సులో‌ ఉన్న పెండ్లి బృందంను దింపారు.


అక్కడి నుంచి పరారవ్వాలని పెళ్లి బృందాన్ని బస్సులోని డ్రైవర్, కండక్టర్ అలర్ట్ చేశారు. అంతే క్షణాల్లో బస్సు ఖాళీ అయిపోయింది. నిమిషాల వ్యవధిలోనే బస్సు దిగి ఎక్కడి వారు అక్కడ పరారయ్యారు. బస్సులో ఉన్న గిఫ్ట్ లు కూడా ఎత్తుకుని మరి ఆ పెంళ్లి బృందం వెళ్లిపోయింది. అక్కడి నుండి హడావుడిగా బస్సును కదిలించాడు డ్రైవర్. ఇంతలో పోలీసు వాహనం బస్సును వేంబడించే ప్రయత్నం చేసింది. బస్సును ప్రక్కకు ఆపాలని సూచనలు ఇవ్వడంతో ఆ తమిళనాడు డ్రైవర్ బస్సును ప్రక్కకు ఆపి ఏమైందని ఎందుకు తమను ఆపారని పోలీసులను ప్రశ్నించారు. బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేసిన పొలీసులు బస్సులోని పెళ్లి ‌బృందం ఎక్కడా అని ప్రశ్నించగా.. తమకు ఏమి తెలియదని తప్పించుకునే ప్రయత్నం చేశారు.