Hyderabad Crime : కస్టమ్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నతాధికారులమంటూ అమాయకులను మోసం చేసి రూ.28 కోట్లను కాజేశారు ఇద్దరు వ్యక్తులు. వారిని కటకటాల్లోకి పంపించారు బాలానగర్ SOT పోలీసులు. సిరిసిల్లకు చెందిన నారాయణ గౌడ్(57), వరంగల్ కు చెందిన శైలజ (37) ఇద్దరికి కొన్ని నెలల క్రితం పరిచయం ఏర్పడింది. నారాయణ గౌడ్ కు జీఎస్టీ శాఖపై పట్టు ఉండడంతో ఉన్నతాధికారి అవతారం ఎత్తాడు.  హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో స్టీల్, సిమెంట్, గోల్డ్, లిక్కర్ వ్యాపారాలు చేసే వారి వద్దకు వెళ్లి తాను కస్టమ్స్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ కమిషనర్ అధికారినంటూ పరిచయం చేసుకున్నాడు. జీఎస్టీ లేకుండానే సామగ్రి కొనుగోలు చేసి అధికంగా సంపాదించుకోవచ్చని వారిని నమ్మించాడు. కస్టమ్స్ లో డిప్యూటీ కమిషనర్ శైలజ మీకు సహకరిస్తుందని ఆమెను వారికి పరిచయం చేశాడు. దాంతో వారిని నమ్మిన సుమారు 18 మంది వ్యాపారులు సుమారు రూ.28 కోట్లను వివిధ రూపాల్లో వారికి కట్టబెట్టారు.  


13 కేసుల్లో నిందితులు 


అనంతరం వారు స్పందించకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల ఆచూకీ కోసం ఆరా తీయగా వీరిద్దరూ నకిలీ అధికారులనే విషయం బయటపడింది.  పోలీసుల విచారణలో బాధితులు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా వారిపై 13 కేసులు నమోదైనట్లు బాలానగర్ డీసీపీ సందీప్ తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి ఎలాంటి ఆధారాలు లేకుండా కస్టమ్స్ అధికారులమని చెబితే అటువంటి మోసపూరిత మాటలు విని మోసపోవద్దని పోలీసులు సూచించారు.



ఐఆర్ఎస్ అధికారులమంటూ మోసాలు 


"ఐఆర్ఎస్ అధికారులమంటూ ఇద్దరు వ్యాపారులను మోసం చేశారు. జీఎస్టీ లేకుండా సిమెంట్, గోల్డ్ , స్టీల్ ఇస్తామంటూ మోసాలకు పాల్పడ్డారు. హైదరాబాద్ లోనే కాదు, చుట్టు పక్కల జిల్లాల్లోని బాధితులు ఉన్నారు. వీరి వద్ద నుంచి నగదు, బంగారం కొనుగోలు చేసిన పత్రాలు స్వాధీనం చేసుకున్నాం. వీరిని జ్యుడిషియల్ కస్టడీకి పంపించాం. ఆ తర్వాత పోలీసు కస్టడీని కోరుతాం. నిందితుల ప్రాపర్టీ వివరాలపై దర్యాప్తు చేస్తాం. వీరిపై నగరంలోని పలు స్టేషన్లలో కేసులు ఉన్నాయి. గతంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడ్డారు. జీఎస్టీ అధికారులు తమ వివరాలు బయటకు చెప్పారు. ఒకవేళ ఇలా ఎవరైనా జీఎస్టీ అధికారులని పరిచయం చేసుకుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజల్ని కోరుతున్నాం.  ఈ నేరానికి ఐడియా ఎలా వచ్చిందంటే... నారాయణ గౌడ్  ట్రావెల్స్ నిర్వహించేవాడు. ఫోర్ వీలర్స్ ను రెంటల్ కు ఇచ్చేవాడు. పలు డిపార్ట్మెంట్ అధికారులకు రెంటల్ కు కార్లు ఇచ్చేవాడు. ఇలా ఒకసారి ఓ కస్టమ్స్ అధికారి కారులో పర్స్ మర్చిపోతే అందులోని కస్టమ్స్ ఐడీ కార్డుతో ఫేక్ ఐడీ కార్డు క్రియేట్ చేసి నారాయణ గౌడ్ ఫొటో పెట్టుకుని వ్యాపారులను మోసం చేశాడు. ఎవరైనా ఐడీ కార్డు తీసుకుని ఇలా మీ దగ్గరకు వస్తే ముందు నమ్మొదు అది నిజమో కాదో నిర్థారణ చేసుకోవాలి. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేశాం. వారిని రిమాండ్ కు తరలించాం." - సందీప్, డీసీపీ బాలానగర్