TDP New Program :  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ కొత్త తరహా పోరాటం ప్రారంభించింది. ఇదేం ఖర్మ పేరుతో ప్రజా ఉద్యమాలను నిర్వహించాలని నిర్ణయించింది. జగన్ రెడ్డి పాలనలో ప్రతి ఒక్కరి నోట ఒక్కటే మాట "ఇదేం ఖర్మ". ప్రజల నిట్టూర్పునే నినాదంగా తీసుకుని... ఈ రౌడీల, దోపిడీదారుల, కుల అహంకారుల పాలనకు వ్యతిరేకంగా...  ప్రభుత్వ బాధితులను ఒక్కటి చేసేందుకు తెలుగుదేశం చేపడుతున్న పోరాటం "ఇదేం ఖర్మ"  అని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ ప్రోగ్రాంపై పార్టీ నేతలకు వివరించారు.  45 రోజులపాటు కొనసాగే ఈ పోరాటంలో మీరూ పాల్గొనాలంటే 92612 92612 నెంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 



మూడున్నరేళ్లలో ఏపీలో ఎంతో విధ్వంసం జరిగిందని అన్నారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఎన్నో దారుణాలు జరిగాయన్నారు. దారుణాలు ఏ టెర్రరిస్టులో చేయలేదని.. పోలీసుల సహకారంతో ప్రభుత్వమే విధ్వంసం సృష్టించిందని మండిపడ్డారు. టీడీపీ ఎప్పుడూ జాతీయ భావాలతోనే వెళ్లిందని తెలిపారు. టీడీపీ జాతీయ ప్రత్యామ్నాయాల్లో కూడా కీలక పాత్ర పోషించిందనినారు.  పలు సంస్కరణలతో టీడీపీ ముందుందని... దేశానికే దిక్సూచిగా ఉండేలా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ప్రతిపక్షంలో కూడా అంతే బాధ్యతగా ఉన్నామన్నారు. ‘‘చాలా మంది సీఎంలను చూశాను.. ఎన్నో ప్రభుత్వాలను చూశాను. ఇంతటి దారుణమైన.. నీచమైన ప్రభుత్వాన్ని చూడలేదు’’ అంటూ చంద్రబాబు (TDP Chief) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.


ప్రతి గ్రామంలో రాబోయే రోజుల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యల్ని, కష్టాల్ని తెలుసుకుంటారు. వారికి అండగా ఉంటామని భరోసా కల్పించడం ఈ కార్యక్రమం ఉద్దేశం అంటోంది టీడీపీ. రాష్ట్రవ్యాప్తంగా 45 రోజులపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు, ప్రజలకు ఎదురవుతున్న ప్రధానమైన సమస్యల్ని ప్రస్తావించనున్నారు. ఈ సమస్యలపై అవగాహన కల్పించి, వాటిపై ప్రజల్లో చర్చ జరిగేలా చూడాలని టీడీపీ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రజలు పడుతున్న అవస్థల్ని బయటపెట్టి, వారిని చైతన్యపరిచి, ప్రభుత్వాన్ని ప్రజాకోర్టులో నిలబెట్టడం ఈ ఆందోళన ప్రధాన ఉద్దేశం అని చెబుతున్నారు. 


 రాజధానుల పేరుతో మూడు ముక్కలాట, ఆకాశంలో ధరలు-అర్ధాకలిలో పేదలు, భయం గుప్పిట్లో ఆడబిడ్డలు, నిరుద్యోగ యువత, మత్తు- యువత భవిత చిత్తు, గిట్టని గిట్టుబాటు ధరలు-రైతన్నల ఆత్మహత్యలు, గుంతలమయమైన రోడ్లు, మన ఇసుక ఎక్కడికెళుతుందో జగన్‌కే ఎరుక, నిధుల లూటీ- ప్రశ్నించినవారిపై లాఠీ, షాక్‌ కొట్టించే కరెంటు ధరలు వంటి అంశాలను ప్రజలకు వివరిస్తారు. ఎన్టీఆర్‌ స్ఫూర్తి-చంద్రన్న భరోసా, బాదుడే బాదుడు వంటి కార్యక్రమాలను టీడీపీ నిర్వహించింది.. ఇప్పుడు  ప్రజల్నీ భాగస్వామ్యం చేసేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.