వైవిద్యమైన సినిమాలతో ఆకట్టుకొనే లేడీ సూపర్ స్టార్ నయన తార మరో ఇంట్రెస్టింగ్ మూవీ అప్‌డేట్‌తో వచ్చేసింది. ఈ సారి థ్రిల్లింగ్ హర్రర్‌తో భయపెట్టేందుకు వచ్చేస్తోంది నయన్. ‘కనెక్ట్’ టైటిల్‌తో వస్తున్న హర్రర్ థ్రిల్లర్‌లో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాప్పీ నటించిన ‘గేమ్ ఓవర్’ మూవీ డైరెక్టర్ అశ్విన్ శరవణన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.


సాధారణంగా అన్ని సినిమాలకు కాసేపు విరామం (ఇంటర్వెల్) ఉంటుంది. కానీ, ఈ మూవీకి మాత్రం ఎక్కడా బ్రేక్ ఉండదట. ప్రేక్షకుడు ఒకసారి సీట్లో కూర్చొన్న తర్వాత.. శుభం కార్డు పడేవరకు కట్టిపడేసే సీన్లతో నిర్విరామంగా ఈ సినిమా స్క్రీనింగ్ ఉంటుందట. ఈ సినిమా మొత్తం నిడివి 95 నిమిషాలు. తాజాగా విడుదలైన ఈ టీజర్ చూస్తే.. తప్పకుండా ప్రేక్షకుడు థ్రిల్‌కు గురవ్వతాడని తెలుస్తోంది. 


టీజర్ చూస్తే ఉలిక్కిపడతారు


కరోనా వైరస్ వల్ల విధించిన లాక్‌డౌన్‌తో టీజర్ స్టార్ట్ అవుతుంది. నిర్మానుష్య వీధులు, నిశబ్ద వాతావరణం నుంచి.. ఒక గదిలో మంచంపై కూర్చొని ఉన్న నయన తార కనిపిస్తుంది. ఆ తర్వాత ఎవరో తలుపు కొడుతున్న శబ్దాలు వినిపిస్తాయి. సత్యరాజ్ ఆశ్చర్యంగా ఫోన్లో ఏదో వింటున్నట్లు కనిపించారు. ఓ చిన్నారి ‘‘అమ్మ వదిలియమ్మా’’ అంటూ తలుపుకొడుతున్న శబ్దాలు విని.. ‘‘సుశాన్ నన్ను ఆ అమ్మాయి దగ్గరకు తీసుకెళ్లు’’ అని అనుపమ్ ఖేర్ అంటారు. దీంతో నయన తార(సుశాన్) ఓ చీకటి గదిలోకి ప్రవేశిస్తుంది. అక్కడ ఓ చిన్నారి మంచానికి కట్టేసి ఉంటుంది. ఇంతలో ఓ భయానక శబ్దం వస్తే నయన్ పైకి చూస్తుంది. సీలింగ్‌పై శిలువ గుర్తులు కనిపిస్తాయి. అవి చూస్తూ మంచం వైపు చూసేసరికి.. ఆ చిన్నారి భయానక రూపంలో కనిపిస్తుంది. దీంతో వెంటనే అనుపమ్ ఖేర్ ఆ గది నుంచి బయటకు వచ్చేయాలని నయన్‌కు చెబుతాడు. ఈ సీన్ చూస్తే తప్పకుండా మీరు ఉలిక్కిపడతారు.


Connect Movie Teaser:



టీజర్‌ను బట్టి చూస్తుంటే.. అనుపమ్ ఖేర్ పరానార్మల్ నిపుణుడని తెలుస్తోంది. ‘కార్తికేయ-2’లో అనుపమ్ ఖేర్ కనిపించింది కాసేపే అయినా.. గుర్తుండిపోయే పాత్రను పోషించారు. అందులో అంథుడిలా నటించిన ఆయన ‘కనెక్ట్‌’లో కూడా అలాంటి పాత్రనే పోషిస్తున్నట్లు తెలుస్తోంది.  టీజర్‌లో అనుపమ్.. ఉన్న చోటు నుంచి కదలకుండానే నయన్‌ చూసేది.. తన కళ్లతో చూస్తాడనిపిస్తుంది. అందుకే, ఆ సినిమాకు ‘కనెక్ట్’ అనే టైటిల్ పెట్టి ఉండవచ్చు. ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా ఈ మూవీని థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. సత్యరాజ్, వినయ్ రాయ్, హనియా నఫీసా తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై విఘ్నేష్ శివన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పృథ్వీ చంద్రశేఖర్ సంగీతం అందించారు. 




Also read: ప్రెగ్నెంట్ వార్తలపై ఎమోజీలతో స్పందించిన ఆది పిన్నిశెట్టి భార్య నిక్కీ గల్రానీ