AP Politics: వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు టీడీపీ వినూత్న కార్యక్రమాన్ని రూపొందించింది. అధికార వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, వైఫల్యాలతో ప్రజలు ఎలా నష్టపోయారో చెప్పేందుకు సరికొత్త కార్యక్రమంతో సిద్ధమైంది. ఆ కార్యక్రమం పేరు 'రాష్ట్రానికి ఇదేమి కర్మ'.
ప్రతిపక్ష టీడీపీ 'ఇదేమి కర్మ' పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ కార్యక్రమంతో వైసీపీ ప్రభుత్వ అరాచకాలను ఎండగట్టాలని భావిస్తోంది. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలతో జనం ఎంతగా నష్టపోయారో వివరించనుంది. దీని ద్వారా వైసీపీ నేతలకు చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తోంది.
ప్రతి ఇంటికి వెళ్లి ప్రజాసమస్యలను రాత పూర్వకంగా తీసుకుని.. వాటిని భారీ వాహనంలో ముఖ్యమంత్రి నివాసానికి పంపేలా టీడీపీ కార్యచరణ రూపోందిస్తోంది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం పార్టీ విసృత్తస్థాయి భేటీలో ఈ కార్యక్రమ తీరుతెన్నులు వివరించారు. కర్నూలు జిల్లా పర్యటన విజయవంతం కావడంతో వచ్చే 2 నెలలో 50కిపైగా నియోజకవర్గాలను చుట్టి రావాలని.. చంద్రబాబు యోచిస్తున్నారు. ఇదే సమయంలో ప్రతి నియోజకవర్గ ఇంఛార్జ్ ప్రజల్లో ఉండేలా ఇదేమీ కర్మ కార్యక్రమం రూపొందించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేలా, నేతలను సిద్ధం చేసేందుకు ఈ కార్యక్రమం ఉపకరిస్తుందని తెలుగుదేశం భావిస్తోంది.
గెలవకపోతే వచ్చే ఎన్నికలే చివరివని తేల్చేసిన చంద్రబాబు !
చంద్రబాబునాయుడు వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించి సీఎంగా పంపించకపోతే ఇక రాజకీయాల్లో ఉండనని ప్రకటించారు. ఆయన అసెంబ్లీలో సవాల్ చేసిన అంశం గురించి ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి సందర్భంలో చేసినా.. చంద్రబాబు అన్న మాటలు మాత్రం ప్రజల్లోకి వెళ్లిపోయాయి. దీనికి వైసీపీ కూడా ఓ కారణం. ఈ సారి ఎన్నికల్లో గెలిస్తే ఇక చంద్రబాబు యాక్టివ్‌గా ఉండలేరని... మనమే 30 ఏళ్ల పాటు సీఎంగా ఉంటామని జగన్ పార్టీ క్యాడర్‌కు చెబుతున్నారు. అంటే వారు కూడా చంద్రబాబు గెలవకపోతే.. ఇవే చివరి ఎన్నికలన్న సందేశం ఇస్తున్నారు. చంద్రబాబు కూడా అదే చెబుతున్నారు. ఓ రకంగా ప్రజల నుంచి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని విపక్షాలు అంటున్నాయి. ఏదైనా రాజకీయ వ్యూహమే. ఎలా చూసినా.. చంద్రబాబు తనకు చివరి చాన్స్ ఇవ్వాలని.. రాష్ట్రాన్ని బాగు చేస్తానని అంటున్నారు.
ఇదే చివరి ఎన్నిక అన్న సానుభూతి అస్త్రాన్ని ప్రజలపై ప్రయోగించారా ?
రాజకీయాల్లో సానుభూతిని మించిన గెలుపు సూత్రం మరొకటి ఉండదు. గత ఎన్నికల్లో ఒక్క చాన్స్ ప్లీజ్ అని జగన్మోహన్ రెడ్డి దీనంగా అడగడం వల్లనే ఆయనకు ప్రజలు చాన్సిచ్చారని రాజకీయవర్గాలు గట్టిగా నమ్ముతూ ఉంటాయి. ఆ మాటకు వస్తే వైఎస్ఆర్‌సీపీ రాజకీయ పునాదులు సానుభూతి మీదనే ఉన్నాయంటారు. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే వ్యూహాన్ని పాటిస్తున్నారని అంచనా వేస్తున్నారు. చివరి ఎన్నిక అంటే.. ప్రజలు చివరి చాన్స్ ఇస్తారని గతంలో అనేక మంది రాజకీయ నేతలు ఇదే నినాదంతో పోటీ చేసినప్పుడు రుజువు అయిందంటున్నారు. చంద్రబాబు కూడా ఇదే వ్యూహాన్ని పాటిస్తున్నారని కొన్ని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే సమయంలో రాష్ట్రానికి ఎంతో సేన తనను.. రాజకీయాలతో సంబంధమే లేని తన కుటుంబాన్ని కించపరిచారని.. గెలిస్తేనే ..సీఎం హోదాలోనే మళ్లీ అసెంబ్లీకి వస్తానని చాలెంజ్ చేశానని ప్రజలకు చెబుతున్నారు. ఇదంతా వ్యూహాత్మకమేనని అంటున్నారు.