Viral Video: ఇప్పటివరకు చాలా రకాల నిరసనలు మీరు చూసి ఉంటారు. కానీ ఈ తరహా నిరసనను ఎప్పుడూ చూసి ఉండరు. ఎందుకంటే ఓ వ్యక్తి.. కలెక్టర్ ముందు కుక్కలా అరుస్తూ నిరసన వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఇదీ జరిగింది
బంగాల్‌లోని బంకురా జిల్లాలోని ఓ గ్రామంలో 'గడప వద్దకే ప్రభుత్వం' కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ సమయంలో జిల్లా ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కారు ఎదుట ఓ వ్యక్తి కుక్కలా అరుస్తూ ఏవో పత్రాలను అందించాడు. కుక్కలా అరుస్తున్న ఆ వ్యక్తి పేరు శ్రీకాంతి కుమార్ దత్తా (Srikanti kumar Dutta). అయితే రేషన్ కార్డులో మాత్రం అతని పేరు శ్రీకాంతి కుమార్ కుత్తా (Srikanti kumar Kutta) అని తప్పుగా అచ్చయింది.
దీంతో ఆ వ్యక్తికి కోపం వచ్చి.. కుక్కలా అరుస్తూ తన పేరును మార్చాలంటూ అర్జీ పత్రాలతో అధికారి ఎదుట నిరసనకు దిగాడు. రేషన్ కార్డులో కుత్తా అని పేరు పడింది కనుక అతను కుక్కలా మొరుగుతూ నిరసన చేపట్టాడు.
అతని బాధను అర్థం చేసుకున్న అధికారి కూడా విసుక్కోకుండా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో అక్కడ ఉన్నవాళ్లంతా ఈ తతంగాన్ని చూసి ఏమవుతుందో అర్థం కాక అయోమయంలో ఉండిపోయారు.
ఎందుకిలా
శ్రీకాంతి కుమార్ పేరు తప్పుగా ప్రింట్ అవ్వడం ఇదే మొదటిసారి కాదట. గతంలోనూ రెండుసార్లు ఇలాగే జరిగిందట. తొలిసారి శ్రీకాంతి కుమార్ దత్తా బదులు శ్రీకాంత మొండల్ అని రాశారట. తప్పును సరిచేయాలని జిల్లా అధికారులకు అర్జీ పెట్టుకుంటే.. శ్రీకాంతో దత్తా అని మార్చారు. గతంలో ప్రభుత్వం నిర్వహించిన గడప వద్దకే కార్యక్రమంలో సమస్యను ప్రస్తావించగా శ్రీకాంతి కుమార్ కుత్తా అని మార్చారని బాధితుడు వాపోయాడు. దీంతో అధికారి ఎదుట వినూత్నంగా నిరసన చేపట్టానని చెప్పుకొచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read: Trump Twitter Account: డొనాల్డ్ ట్రంప్ ఈజ్ బ్యాక్! ఇక ట్విట్టర్ మోత మోగిపోద్ది!