Trump Twitter Account: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించారు. 22 నెలల తర్వాత ట్రంప్ ట్విట్టర్ ఖాతాపై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు ఆ సంస్థ చీఫ్ ఎలాన్ మస్క్ ప్రకటించారు.
పోల్ ద్వారా
జీవితకాల నిషేధానికి గురైన ట్రంప్ ఖాతాను ట్విట్టర్ పునరుద్ధరించేందుకు ఓ పోల్ నిర్వహించింది. డొనాల్డ్ ట్రంప్‌కు తిరిగి ట్విట్టర్ ఖాతాను ఇద్దామా వద్దా అని మస్క్ పోల్ నిర్వహించారు. ఎస్ ఆర్ నో చెప్పాలంటూ శనివారం ఓ ట్వీట్ చేశారు.
24 గంటలపాటు కొనసాగిన ఈ పోల్‌లో కోటీ 50 లక్షల 85వేల 458 మంది పాల్గొన్నారు. అందులో 51.8 శాతం మంది ట్రంప్‌కు అనుకూలంగా, 48.2 శాతం మంది వ్యతిరేకంగా స్పందించారు. దీంతో 22 నెలల నిషేధం తర్వాత ట్రంప్ ట్విట్టర్ ఖాతాను సంస్థ పునరుద్ధరించింది. ఆయన ఖాతాను పునరుద్ధరిస్తున్నామని మస్క్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. "ప్రజల స్వరం, దేవుని స్వరం" (వోక్స్ పాపులి, వోక్స్ డీ) అంటూ ల్యాటిన్ పదబంధాన్ని ఉపయోగిస్తూ ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు.
ఇలా నిషేధం
2021 జనవరిలో జరిగిన క్యాపిటల్ హిల్ దాడి తర్వాత ట్రంప్ అకౌంట్‌ను మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ బ్యాన్ చేసింది. హింసను ట్రంప్ మరింత ప్రేరేపించే అవకాశమున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అప్పట్లో ట్విట్టర్ వెల్లడించింది. జో బైడెన్ ప్రమాణస్వీకార వేడుకకు హాజరుకానని ట్రంప్ ట్వీట్ చేసిన కొద్ది గంటలకే ట్విట్టర్ ఈ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ట్రంప్ ఖాతాలో ఫొటోలు, ట్వీట్లు మాయమయ్యాయి. శాశ్వత నిషేధానికి గురైన సమయంలో ట్రంప్‌కు 88.7 మిలియన్ ఫాలొవర్స్ ఉన్నారు. అధ్యక్షుడు 51మందిని ఫాలో అయ్యారు.
ట్రంప్‌తో పాటు ఆయన మాజీ భద్రతా సలహాదారు మైకెల్ ఫ్లిన్, ఆయన అటార్నీ సడ్నీ పావెల్ ఖాతాలను కూడా తొలగించింది ట్విట్టర్. క్యాపిటల్ హింసాకాండా అనంతరం ద్వేషపూరిత ప్రసంగాలు, ట్వీట్లను తొలగించే పనిలో పడ్డ సామాజిక మాధ్యమ దిగ్గజం వీరి ఖాతాలను కూడా నిషేధించింది.
ఇలా దాడి
బైడెన్‌ను అధ్యక్షుడిగా ధ్రువీకరించేందుకు కాంగ్రెస్ సమావేశమైన నేపథ్యంలో వేలాది మంది ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనంలోకి దూసుకెళ్లి అప్పుడు బీభత్సం సృష్టించారు. పరిస్థితిని అదుపుచేసే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది గాయపడ్డారు.
Also Read: PM Modi In Kashi : రజనీ స్టైల్ పంచెకట్టులో ప్రధాని మోదీ - కాశీలో తమిళ సంగమం అదుర్స్ !