ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్ప పీడనంగా మారి శనివారం (నవంబరు 19) మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించిందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రానున్న 24 గంటల్లో ఇది మరింత బలపడి వాయుగుండంగా మారి నైరుతికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించనుంది. ఆ తరవాత 2 రోజుల్లో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాఆంధ్ర తీరం దిశగా దాని కదలిక ఉండనుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
దీని ప్రభావంతో నవంబరు 20 నుంచి 23 వరకూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తాలో పలుచోట్ల, రాయలసీమ, ఉత్తర కోస్తా ఆంధ్రల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. ఈనెల 21న ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లా్ల్లో, 22న నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, అనంతపురం ఉమ్మడి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.
అదేవిధంగా 20, 21వ తేదీల్లో దక్షిణ కోస్తాంధ్ర, నైరుతి బంగాళాఖాతంలో తీరం వెంబడి గంటకు 40 నుంచి 45 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. చేపల వేటలో వున్న మత్స్యకారులు ఆదివారంలోగా తీరానికి చేరుకోవాలని నిర్దేశించింది. ఇక శనివారం ఏపీ, తెలంగాణలో అనేక ప్రాంతాల్లో చలి వాతావరణం కొనసాగింది. ఇక రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి.
హైదరాబాద్‌లో వాతావరణ పరిస్థితులు
Hyderabad Weather News: ‘‘ఆకాశం నిర్మలంగా ఉంటుంది. నగరంలో పొగమంచు ఉదయం సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 28 డిగ్రీలు, 14 డిగ్రీల వరకూ ఏర్పడే అవకాశం ఉంది. ఈశాన్య దిశల నుంచి గాలులు గాలి వేగం గంటకు 3 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక శనివారం నమోదైన గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 28.3 డిగ్రీలు, 16.1 డిగ్రీల సెల్సియస్‌గా ఉన్నాయి’’ అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో వెల్లడించారు.
తెలంగాణలో పొడి వాతావరణమే
Telangana Weather News: ఇక తెలంగాణలో వచ్చే నాలుగు రోజుల పాటు చాలా చోట్ల పొడి వాతావరణమే ఉంటుందని వాతావరణ అధికారులు అంచనా వేశారు. కానీ, దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మాత్రం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఇక చలి వాతావరణం తెలంగాణలో మరింత పెరుగుతోంది. రాబోయే రోజుల్లో కూడా అక్కడక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.