Uniform Civil Code in Gujarat:
కమిటీ రెడీ..
గుజరాత్ ప్రభుత్వం Uniform Civil Codeని అమలు చేస్తుందన్న వార్తలు వినిపిస్తుండగానే...ఆ ప్రభుత్వం అధికారికంగా దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించింది. రాష్ట్రంలో ఈ కోడ్‌ను అమలు చేసేందుకు ప్రత్యేకంగా ఓ కమిటీని నియమించినట్టు స్పష్టం చేసింది. రాష్ట్ర కేబినెట్ ఈ కమిటీని నియమించేందుకు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌కు సర్వాధికారాలు కట్టబెట్టింది. ఈ కమిటీలో ఎవరెవరు సభ్యులుగా ఉన్నారన్నది త్వరలో సీఎం ప్రకటించనున్నారు. ఓ రిటైర్డ్ హైకోర్ట్ జడ్జ్ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటైనట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని సీఎం భూపేంద్ర పటేల్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. "ఇవాళ జరిగిన కేబినెట్ మీటింగ్‌లో కీలక నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయాలని భావిస్తున్నాం. ఇందుకోసం సుప్రీం కోర్టు, లేదా హైకోర్ట్ రిటైర్డ్ జడ్జ్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయనున్నాం. వాళ్లే దీనిపై ఓ ముసాయిదా తయారు చేస్తారు" అని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో సీం భూపేంద్ర పటేల్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘవి ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు తామూ యూనిఫామ్ సివిల్ కోడ్‌ను అమలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్టు సంకేతాలిచ్చాయి. భాజపా నేతలంతా ఈ కోడ్ అమలు చేయడాన్ని సమర్థిస్తున్నప్పటికీ...కొన్ని వర్గాలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
ఇది రాజ్యాగబద్ధం కాదు..
ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (AIMPLB) ఈ కోడ్ అమలు చేయడం రాజ్యాంగ బద్ధం కాదని, మైనార్టీలకు వ్యతిరేకమని మండి పడుతోంది. కేవలం నిరుద్యోగం, ద్రవ్యోల్బణం లాంటి కీలక సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే భాజపా ఇలా చేస్తోందని విమర్శిస్తోంది. 2019లో లోక్‌సభ ఎన్నికలు జరిగిన సమయంలో భాజపా యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తామని హామీ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా యూసీసీ అమలు చేయాలని పార్లమెంట్‌కు ఆదేశాలివ్వలేమని, ప్రజల చేత ఎన్నికైన ప్రతినిధులే నిర్ణయం తీసుకోవాలని గత నెల సుప్రీం కోర్టుకి చెప్పింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర న్యాయ శాఖ కూడా తన అఫిడవిట్‌లో ఇదే అంశాన్ని ప్రస్తావించింది. విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవాల్సింది ప్రజా ప్రతినిధులేనని, నేరుగా కేంద్ర ప్రభుత్వం యూసీసీ అమలు చేయాలని ఆదేశాలు ఇవ్వలేదని సుప్రీం కోర్టుకి తెలిపింది.
ఇదీ యూసీసీ..
సాధారణంగా మన దేశంలో ఒక్కో మతానికి ఒక్కో చట్టం ఉంటుంది. ఆయా మతాల ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం కొన్ని చట్టాలను అనుసరిస్తుంటారు. హిజాబ్, ట్రిపుల్ తలాక్ లాంటి అంశాలు ఈ కోవకు వస్తాయి. అయితే...Uniform Civil Code అమలు చేస్తే అన్ని మతాలు, వర్గాలకు ఒకే చట్టం అమలవుతుంది. అంటే...అందరికీ కలిపి ఉమ్మడి చట్టం. మతాల వారీగా చట్టాలు ఉండటం వల్ల న్యాయవ్యవస్థపై భారం పడుతోందన్నది కొందరి వాదన. ఈ సివిల్ కోడ్ అమల్లోకి వస్తే ఏళ్లుగా నలుగుతున్న కేసులకూ వెంటనే పరిష్కారం దొరుకుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు గుజరాత్ ప్రభుత్వం రాష్ట్రంలో ఈ కోడ్‌ను అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Also Read: Parag Agrawal: ట్విట్టర్ నుంచి బయటకు వెళ్తూ, పరాగ్ అగర్వాల్ ఎంత డబ్బు తీసుకెళ్తారో తెలుసా?