Viral Video: ఇన్‌స్టా రీల్స్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు కొందరు. పబ్లిక్ ప్లేసెస్‌లో ఎక్కడ పడితే అక్కడ డ్యాన్స్‌లు చేస్తూ రీల్స్ క్రియేట్ చేస్తున్నారు. పక్క వాళ్లకి డిస్టర్బెన్స్ అవుతుందా అన్నది కూడా ఆలోచించడం లేదు. ముఖ్యంగా టూరిస్ట్ ప్లేస్‌లలో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. అప్పటికీ సెక్యూరిటీ గార్డ్‌లు వచ్చి ఇలా రీల్స్ చేసే వాళ్లని వారిస్తున్నారు. కొన్ని చోట్ల అయితే అసలు వీడియో షూటింగ్ చేయకుండా ఆంక్షలు విధిస్తున్నారు. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో ఒక్కోసారి గొడవలు జరుగుతున్నాయి. ఢిల్లీలో అదే జరిగింది. తాజ్‌మహల్‌లో వీడియో షూటింగ్‌ని బ్యాన్ చేసినా ఓ యువతి రీల్‌ చేసేందుకు ప్రయత్నించింది. అక్కడే ఉన్న CISF జవాన్ ఆమెని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. ఇక్కడ రీల్‌ చేయకూడదని హెచ్చరించాడు. కానీ ఆ యువతి మాట వినలేదు. పైగా ఆ జవాన్‌ అడ్డుకుంటున్నాడని ఆయనను వెనక్కి తోసేసింది. ఆ తరవాత ఆ జవాన్ కూడా అసహనానికి లోనయ్యాడు. ఆ యువతిని వెనక్కి తోసేశాడు. ఇద్దరి మధ్య కాసేపు ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. యువతి ఆయనను కాలితో తన్నింది. ఇదంతా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతానికి ఈ వీడియో వైరల్ అవుతోంది. చాలా సేపు గొడవ తరవాత ఆ యువతి జవాన్‌కి సారీ చెప్పింది. అప్పుడు కానీ అంతా సద్దుమణగలేదు. ఆమె క్షమాపణలు చెప్పిన తరవాతే మొబైల్ ఇచ్చి అక్కడి నుంచి పంపించారు.