Shubhanshu Shukla News: భారతీయ వ్యోమగామి శుభాన్షు శుక్లా, మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి అంతరిక్ష కేంద్రానికి చేపట్టిన  చారిత్రాత్మక యాత్ర Axiom-4 మరోసారి వాయిదా పడింది. ఈ మిషన్ కింద వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) పంపించాల్సి ఉంది. ఇది వాయిదా పడినట్టు SpaceX కంపెనీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.  

SpaceX కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, రాకెట్ లోని ఒక భాగంలో లిక్విడ్ ఆక్సిజన్ (LOx) లీక్ అయింది, దీని కారణంగా ప్రయోగాన్ని వాయిదా వేశారు. రాకెట్ ను పరిశీలించే సమయంలో ఈ లీక్ విషయం వెలుగులోకి వచ్చింది.  ఇప్పుడు సాంకేతిక బృందం ఈ లోపాన్ని సరిచేస్తోంది. మరమ్మత్తు పూర్తయ్యే వరకు ప్రయోగానికి అనుమతి రాదు.  ప్రయోగానికి అనుమతి వచ్చే వరకు కొత్త తేదీని ప్రకటించలేమని తెలిపారు.

వాతావరణం ఆటంకం కలిగించవచ్చు

అంతేకాకుండా, వాతావరణం కూడా ఆటంకం కలిగించే అవకాశం ఉంది.  వాతావరణ శాఖ ప్రకారం, జూన్ 11, 12 తేదీల‌్లో బలమైన గాలులతో వర్షాలు పడొచ్చు. ఇది కూడా ప్రయోగం నిలిచిపోయేందుకు ఛాన్స్ ఎక్కువగా ఉంది.  

ISSకి వెళ్ళే మొదటి భారతీయుడు శుభాన్షు

శుభాన్షు శుక్లా ఈ మిషన్‌కు పైలట్‌గా వ్యవహరిస్తున్నారు. అతను ISS కి వెళ్ళే మొదటి భారతీయుడు అవుతాడు. రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్ళే రెండో భారతీయుడు అవుతాడు. అతనితోపాటు అమెరికా, పోలాండ్, హంగేరీకి చెందిన యాత్రికులు కూడా ఈ మిషన్ లో ఉన్నారు. ఈ మిషన్ దాదాపు 2 నుంచి 3 వారాల పాటు కొనసాగుతుంది. అంతరిక్ష కేంద్రంలో శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించనున్నారు. ఇప్పుడు అందరి దృష్టి SpaceX మరమ్మత్తు ప్రక్రియ, వాతావరణ పరిస్థితులపై ఉంది.