South Central Railway Special Trains For Ugadi: ఉగాది పండుగ సందర్భంగా సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. విజయవాడ - హుబ్బళ్లి - విజయవాడ మధ్య 2 ప్రత్యేక రైళ్లను నడిపించినున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 10న (బుధవారం) విజయవాడ - హుబ్బళ్లి (07001) మధ్య ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. అలాగే ఈ నెల 11న హుబ్బళ్లి - విజయవాడ (07002) మధ్య కూడా ప్రత్యేక సర్వీసును నడపనున్నట్లు తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లు ఇరుమార్గాల్లో గుంటూరు, నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపూర్ రోడ్, గిద్దలూరు, నంద్యాల, డోన్, గుంతకల్లు, బళ్లారి, తోరనగల్లు, హోసేపేట జంక్షన్, మునిరాబాద్, కొప్పాల్, గదగ్, అన్నిగెరి స్టేషన్లలో ఆగుతాయని పేర్కొన్నారు. ప్రయాణికులు ముఖ్యంగా విజయవాడ ఈ వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
వేసవి సెలవుల నేపథ్యంలో
అటు, వేసవి సెలవుల నేపథ్యంలో ప్రయాణీకుల రద్దీ పెరిగిన దృష్ట్యా సికింద్రాబాద్ నుంచి, నాగర్ సోల్ మధ్య కూడా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. అలాగే, తిరుపతి, మచిలీపట్నం మధ్య కూడా స్పెషల్ రైళ్లు నడపనున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఏప్రిల్ 17, 24.. మే 1, 8, 15, 22, 29 తేదీల్లో సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక రైళ్లు (07517) బయలుదేరుతాయి. మరుసటి ఉదయం 8 గంటలకు నాగర్ సోల్ చేరుకుంటాయి. నాగర్ సోల్ నుంచి ఏప్రిల్ 18. 25.. మే 2, 9, 16, 23, 30 తేదీల్లో రాత్రి 10 గంటలకు ప్రత్యేక రైళ్లు బయలుదేరుతాయి. మరుసటి రోజు ఉదయం 10:50 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ కు చేరుకుంటాయని సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది. ప్రయాణికులు ఈ సర్వీసులు వినియోగించుకోవాలని సూచించింది.
తిరుపతి - మచిలీపట్నం మధ్య
తిరుపతి నుంచి ఏప్రిల్ 14, 21, 28.. మే 5, 12, 19, 26 తేదీల్లో రాత్రి 10:20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7:30 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. మచిలీపట్నం నుంచి ఏప్రిల్ 15, 22, 29.. మే 6, 13, 20, 27 తేదీల్లో సాయంత్రం 5:40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 3:20 గంటలకు తిరుపతి చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక సర్వీసులను ప్రయాణీకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Also Read: TDP News: సిట్ ఆఫీసు వద్ద కీలక ఫైల్స్ దగ్ధం! అవి చంద్రబాబు అక్రమ కేసుల పత్రాలేనా?