Chandrababu News: ఏపీలో ఎన్నికల వేళ కొత్త అంశం చర్చనీయాంశం అవుతోంది. గతేడాది విపక్ష నేత చంద్రబాబుపై నమోదైన అక్రమ కేసులకు సంబంధించిన ఫైల్స్ ను అధికార పార్టీ కనుమరుగు చేసిందని టీడీపీ ఆరోపిస్తోంది. సిట్ కార్యాలయంలో చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులకి సంబంధించిన ఫైల్స్ కాల్చేశారని టీడీపీ ఓ పోస్టు చేసింది. ఫైల్స్ కాల్చివేతకు సంబంధించి ఓ వీడియోను కూడా జత చేసింది.


ఈ వ్యవహారంతో సీఐడీ అధికారులు కుట్ర చేస్తున్నారంటూ టీడీపీ ఆరోపణలు చేస్తోంది. ప్రభుత్వం మారుతుందన్న సంకేతాలు బలంగా ఉన్నాయి.. అందుకే ఇంత వరకూ అధికార పార్టీకి సహకరించిన అధికారులలో టెన్షన్ మొదలైందని టీడీపీ నేతలు కూడా వాదిస్తున్నారు. చంద్రబాబుపై అక్రమ కేసులు  బనాయించడానికి సృష్టించిన నకిలీ పత్రాలను తగలబెడుతున్న వీడియో బయటకు రావడంతో సీఐడీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా దొరికారని వారు ఆరోపణలు చేస్తున్నారు.


సిట్ కార్యాలయం వద్ద ఇన్నర్ రింగ్ రోడ్, స్కిల్ డెవలప్మెంట్, హెరిటేజ్ ఫుడ్స్ పత్రాలు దగ్దం అయినట్లుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, సీఐడీ ఉన్నతాధికారి కొల్లి రఘురామిరెడ్డి ఆదేశాలతో ఈ ఫైల్స్ తగలబెట్టినట్లుగా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.






ఖండించిన సీఐడీ


చంద్రబాబు అక్రమ కేసులకు సంబంధించిన ఫైల్స్‌ తగలబెట్టారంటూ టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని సీఐడీ ఖండించింది. దీనికి సంబంధించి సీఐడీ ఐజీ కొల్లి రఘురామిరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబుపై ఇన్నర్ రింగ్ రోడ్డు సహా 5 కేసుల్లో ఛార్జ్ షీట్లు దాఖలు చేశామని.. ప్రతి ఛార్జ్ షీట్‌ను 8 వేల నుంచి 10 వేల కాపీలతో రూపొందించామని వివరించారు.


ప్రతి కేసు ఛార్జ్ షీట్ కాపీలను ప్రతి కేసులో ఉన్న నిందితులకు అందించామని చెప్పారు. హెరిటేజ్‌కి సంబంధించిన డాక్యుమెంట్లు అన్ని కోర్టుకి గతంలోనే అందజేశామని.. హెరిటేజ్ కంపెనీకి చెందిన వ్యక్తుల ఐటీ రిటర్న్స్ వివరాలు కోర్టుకి అందించినట్లు చెప్పారు. హెరిటేజ్ కంపెనీకి చెందిన వారికి కూడా ఆ డాక్యుమెంట్లు అందించినట్లు సీఐడీ ఓ ప్రకటనలో వివరించింది.