TDP News: ఎన్నికల వేల పల్నాడు మరోసారి ఉలిక్కిపడింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో అన్న సందేహంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. 




పల్నాడు జిల్లా పెదకూరపాడులోని క్రోసురులో తెలుగు దేశం పార్టీ ఆఫీస్‌కి  గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో కార్యాలయం అగ్నికి ఆహుతి అయిపోయింది. మంటలలో ఫర్నీచర్‌ పూర్తిగా ధ్వంసమైంది. ఎన్నికల వేళ తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. 




పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్ రావు, తెలుగు దేశం పార్టీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ పోటాపోటీగా ప్రెస్ మీట్‌లు నిర్వహించారు. అనంతరం ఈ కార్యాలయం ఇలా మంటలకు కాలిబూడిదైపోవడంపై చర్చ నడుస్తోంది. 15 రోజుల క్రితం అమరావతి మండలం ధరణికోటలో వైసీపీ కార్యాలయం కూడా ఇలానే అగ్నికి ఆహుతి అయిపోయింది. ఇప్పుడు తెలుగు దేశం పార్టీ కార్యాలయం కూడా అదే స్థితిలో కాలిపోయింది. 





ఈ రెండింటిపై పోలీసులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు ఇందులో ప్రధాన సూత్రధారులను అరెస్టు చేసే పనిలో ఉన్నారు. టీడీపీ ఆఫీస్‌కు చేరుకున్న పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. ఎన్నికల టైంలో ఇలాంటివి జరుగుతుండటంతో అప్రమత్తమైన పోలీసులు పల్నాడులో 144 సెక్షన్ విధించారు.