AP Elections 2024: కనిగిరి: ‘జగన్‌కు ఓటు వేస్తే సంక్షేమ పథకాల కొనసాగింపు.. చంద్రబాబుకు కనుక ఓటేస్తే పథకాలకు ముగింపు. చంద్రబాబు దారి ఎప్పుడూ అడ్డదారే. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు, మోసం, అబద్ధాలు, కుట్రలు’ అని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) అన్నారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర పదో రోజు ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. కొనకొనమిట్లలో ఏర్పాటు చేసిన వైసీపీ బహిరంగ సభలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘ఈ ఎన్నికలు రాబోయే మీ ఐదేళ్ల భవిష్యత్‌ నిర్ణయిస్తాయి. ఇవి ఎంపీ, ఎమ్మెల్యేలను ఎన్నికలు కావు. పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి. అవ్వాతాతలకు పింఛన్లు రాకుండా తన మనిషి నిమ్మగడ్డ రమేష్‌తో చంద్రబాబు ఫిర్యాదు చేయించారు. వాలంటీర్ వ్యవస్థను అడ్డుకోవాలని కుట్రలు పన్నిన వ్యక్తి చంద్రబాబు’ అంటూ మండిపడ్డారు.




సంక్షేమం కొనసాగాలంటే వైసీపీనే రావాలి.. 
చంద్రబాబు దారి ఎప్పుడూ అడ్డదారే. పిల్లలు బడికి వెళితే అమ్మ ఒడి రావాలన్నా, అక్కాచెల్లెమ్మల సాధికారత కొనసాగాలన్నా వైసీపీ అధికారంలో ఉండాలి. వైఎస్సార్ రైతు భరోసా కొనసాగాలన్నా, అవ్వాతాతల సంక్షేమం కొనసాగాలా, వెనక్కి వెళ్లాలా అని నిర్ణయిస్తాయి ఈ ఎన్నికలు. రాష్ట్రంలో అవ్వాతాతలకు, వితంతువులకు వారి ఇంటి వద్దకు ఫించన్లు రాకుండా చంద్రబాబు అడ్డుకున్నాడు. మనం ఇంటింటికి పింఛన్లు ఇవ్వడం నేరమని ఫిర్యాదు చేయించారు. ఆదివారం అయినా వాలంటీర్లు నెల ఒకటో తేదీన ఫించన్లు ఇచ్చేవాళ్లు. కానీ చంద్రబాబు నియమించిన జన్మభూమి కమిటీలు పింఛన్లకు కూడా లంచాలు తీసుకున్నాయి. రోజుల తరబడి క్యూ లైన్లలో నిలుచున్నా పింఛన్ డబ్బులు చేతికి వచ్చేవి కాదు. అవ్వాతాతలకు ఇబ్బంది లేకుండా ఇంటి వద్ద పింఛన్ ఇవ్వడాన్ని చంద్రబాబు వ్యతిరేకించి ఈసీకి ఫిర్యాదు చేయించారు. పింఛన్ల కోసం మండుటెండలో ఆఫీసుల చుట్టూ తిరుగుతూ చనిపోతున్నారు. వీటన్నింటికి కారకుడు చంద్రబాబు’ అని సీఎం జగన్ ఆరోపించారు.


 






మంచి చూడలేని శాడిస్ట్ చంద్రబాబు 
పేదలకు మంచి జరుగుతుంటే చూడలేని శాడిస్ట్ చంద్రబాబు. వ్యవసాయం దండగ అన్న వ్యక్తిని ఏమనాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలను కించపరుస్తూ మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు. ప్రభుత్వ బడులలో ఇంగ్లీష్‌ మీడియం పెడుతుంటే అడ్డుపడుతున్నాడు. పేదలకు సంక్షేమ పథకాలు ఇస్తే ఏపీ శ్రీలంక అవుతుందన్నాడు. చంద్రబాబు సహా టీడీపీ నేతలు వాలంటీర్లను కించపరిచి  మాట్లాడారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక్క స్కీమ్ గుర్తుకురావు. 58 నెలల జగన్ పాలనపై ఎవరిని అడిగినా తమకు జరిగిన మేలు గురించి చెబుతారు. దేశంలో రూ.3 వేల పెన్షన్‌ ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఏపీ. 


గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. పగటి పూటే రైతులకు ఉచిత కరెంటు, ఉచిత పంటబీమా సైతం అందిచ్చాం. ఆక్వా రైతులకు రూపాయిన్నరకే కరెంటు. వంద సంవత్సరాల తర్వాత భూముల రీ సర్వే చేయిస్తున్నాం. ఏకంగా 30 లక్షల ఎకరాల మీద సంపూర్ణ హక్కులు కల్పించాం.  అమ్మఒడి ఇచ్చాం. ప్రభుత్వ బడులు రూపు రేఖలు మార్చేశాం. అక్కచెల్లెమ్మలకు ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, సున్నా వడ్డీ రుణాలు అందిచ్చాం. 


వైసీపీ హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం.. 
వాహన మిత్ర, లా నేస్తంతో పాటు అక్కాచెల్లెమ్మలకు రాజకీయ సాధికారత వైసీపీ హయాంలోనే వచ్చింది. నామినేటెడ్‌ పోస్టుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎక్కువ అవకాశం ఇచ్చాం. కొత్త మెడికల్‌ కాలేజీలు. మేనిఫెస్టోలో నూటికి 90 శాతం పైగా హామీలు నెరవేర్చాం. ఎయిర్‌పోర్టుల నిర్మాణం వేగంగా జరగుతోంది. 5 ఏళ్లకు మనం ఇన్ని చేస్తే, 14 ఏళ్లు అధికారంలో ఉండి చంద్రబాబు ఎందుకు చేయలేకపోయారు. ట్యాబ్లెట్లు వేసుకున్నా చంద్రబాబు కడుపుమంట తగ్గదు. 2014లో చంద్రబాబు ఇదే కూటమితో ముందుకువచ్చారు. రుణమాఫీ చేయలేదు. పొదుపు సంఘాల రుణాలు రద్దు చేయలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. అర్హులైన పేదవారికి మూడు సెంట్ల స్థలం కూడా ఇవ్వలేదు. చంద్రబాబును నమ్మడమంటే పులినోట్లో తలకాయ పెట్టడమే. వైసీపీ గుర్తు ఫ్యాన్.. మన గుర్తుకు ఓటేసి మీ బిడ్డ జగన్‌ను గెలిపించి’ సంక్షేమ పథకాలకు జై కొట్టాలని జగన్ పిలుపునిచ్చారు.