Gaming App Scam: 


గేమింగ్ యాప్‌తో స్కామ్..? 


కలకత్తాలో ఈడీ సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మొబైల్ గేమింగ్ అప్లికేషన్స్‌కు సంబంధించిన కేసులో కలకత్తాలోని ఆరు చోట్ల సోదాలు నిర్వహించారు ఈడీ అధికారులు. ఈ సోదాల్లో రూ.7 కోట్ల నగదుని స్వాధీనం చేసుకున్నారు. ప్రివెన్షన్ ఆమ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA)2022 చట్టం నిబంధనల ప్రకారం...ఈ సోదాలు చేసినట్టు అధికారులు తెలిపారు. క్యాష్ కౌంటింగ్, సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. పార్క్ స్ట్రీట్ పోలీస్‌ స్టేషన్‌లో ఇందుకు సంబంధించిన FIR నమోదైంది. ఫెడరల్ బ్యాంక్ అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా...ఈ సోదాలు నిర్వహించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆమిర్ ఖాన్‌ను గుర్తించారు. E-Nuggets పేరుతో ఆమిర్ ఖాన్ ఓ యాప్‌ తయారు చేశాడు. ఈ యాప్ ద్వారా ఎంతో మందిని మోసం చేశాడని, ఈడీ తెలిపింది. ఇప్పటి వరకూ ఆయన ఇంట్లో రూ.7 కోట్ల నగదు దొరికినట్టు చెప్పింది. ఈ స్కామ్‌లో ఇంకెవరి హస్తం ఉందన్నది విచారణ కొనసాగుతోంది. ప్రభుత్వం కూడా దీన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. ఈ యాప్‌ను ఎవరు ఆపరేట్ చేస్తున్నారు..? చైనా లోన్ యాప్స్‌తో దీనికి ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో విచారణ జరపాలని ఆదేశించింది. లోన్‌ యాప్స్‌లో  రుణాలు పొంది, వాళ్ల ఒత్తిడి తట్టుకోలే ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు ఈ మధ్య కాలంలో వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే...ప్రభుత్వం అప్రమత్తమైంది. 






లోన్ యాప్‌లపై కేంద్రం సీరియస్ 


లోన్ యాప్‌ల ఆగడాలు, అకృత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎంతోమందిని ఆత్మహత్య చేసుకునేలా వేధిస్తోన్న ఈ లోన్‌ యాప్‌లపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. చట్ట విరుద్దమైన లోన్ యాప్‌లపై కేంద్రం సీరియస్ అయింది. 
వీటిపై చర్యలు తీసుకునేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. అక్రమ లోన్ యాప్‌లపై కఠిన చర్యలకు ప్రణాళిక రచించింది. చట్టబద్దమైన యాప్‌ల వైట్ లిస్ట్‌ను తయారు చేయాలని ఆర్‌బీఐకు కేంద్రం ఆదేశించింది. 
వైట్ లిస్ట్‌లో ఉన్న లోన్ యాప్‌లను మాత్రమే యాప్ స్టోర్‌లలో హోస్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. అక్రమ లోన్ యాప్‌ల లావాదేవీలపై ఈడీ, సీబీఐ దృష్టి సారించాలని నిర్ణయించింది. అక్రమ లోన్ యాప్‌ల ఆట కట్టించేందుకు అన్ని మంత్రిత్వశాఖలు, ఏజెన్సీలు కలిసికట్టుగా పనిచేయాలని సమావేశంలో కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. ఆన్లైన్ లోన్ యాప్ ల ఆగడాలకు దేశవ్యాప్తంగా ఎంతో మంది బలైపోయారు. లోన్ యాప్‌లో రుణం తీసుకుంటే ఇక చావే శరణ్యం అన్నంతగా వేధిస్తున్నారు రికవరీ ఏజెంట్లు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో మంది ఉసురు తీశాయి లోన్ యాప్‌లు. ఇటీవల రాజమహేంద్రవరంలో దంపతులు ఆత్మహత్యకు కారణమయ్యాయి.


Also Read: Britain New King: బ్రిటన్ రాజుగా ప్రిన్స్ ఛార్లెస్-III,అధికారికంగా రాచరిక బాధ్యతలు అప్పగింత