Munugode Congress :   మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరరగనున్న ఉపఎన్నికల్లో ఇతర పార్టీల కన్నా ముందే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ దివంగత నేత, మునుగోడు నుంచి ఐదు సార్లు గెలిచిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా ఖరారు చేశారు. అయితే పలువురు నేతుల టిక్కెట్ ఆశించారు. వారందరూ అసంతృప్తికి గురయ్యారు. వారిని బుజ్జగించేందుకు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ఇతర సీనియర్ నేతలు రంగంలోకి దిగారు. నిన్నటి వరకూ ప్రధానంగా టిక్కెట్ రేసులో చల్లమల్ల కృష్ణారెడ్డి పేరు ప్రధానంగా వినిపించింది. ఆయనను రేవండ్ రెడ్డి పిలిచి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుందని .. అభ్యర్థి గెలుపు కోసం పని చేయాలని సూచించారు. దానికి కృష్ణారెడ్డి అంగీకరించారు. 


రేవంత్ రెడ్డితో సమావేశం అయిన చలమల కృష్ణారెడ్డ, పాల్వాయి స్రవంతి


మరోవైపు మునుగోడు అభ్యర్థి పాల్వాయి స్రవంతి కూడా రేవంత్ ఇంటికి వెళ్లారు. పాల్వాయి స్రవంతి, చెలమల కృష్ణా రెడ్డి ఇద్దరిని కూర్చొబెట్టి పీసీసీ చీఫ్ రేవంత్ మాట్లాడారు. విభేదాలను పరిష్కరించే ప్రయత్నం చేశారు.  నాయకులు అందరూ ఐకమత్యంతో పనిచేసి మునుగోడు బైపోల్ లో కాంగ్రెస్ కు విజయాన్ని సాధించిపెట్టాలని కాంగ్రెస్ అధిష్ఠానం శుక్రవారం రోజున సూచించింది. ఈమేరకు కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ ట్విట్టర్ వేదికగా నిన్న ఓ పోస్ట్ చేశారు. తన పోస్ట్ తో పాటు పాల్వాయి స్రవంతిని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటిస్తూ కాంగ్రెస్ అధిష్టానం జారీ చేసిన లేఖను ఆయన ట్యాగ్ చేశారు.  


మునుగోడు కీలక నేతలతో  భేటీ కానున్న సీనియర్ నేతలు


మునుగోడు అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డ వారిలో చెల్లమల్ల కృష్ణారెడ్డితో పాటు పల్లె రవి, కైలాష్ నేత కూడా ఉన్నారు. వీరిని బుజ్జగించేందుకు ఇవాళ సాయంత్రం 4 గంటలకు  ఏఐసీసీ సెక్రటరీ బోసు రాజు ఆధ్వర్యంలో ప్రత్యేక  సమావేశం జరగనుంది. దీనికి కాంగ్రెస్ మునుగోడు అభ్యర్థి పాల్వాయి స్రవంతి కూడా హాజరుకానున్నారు. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రెడ్డి, మధుయాష్కీ, ఇతర ముఖ్య నేతలు కూడా హాజరవుతారు. 


ఇంకా మునుగోడు ఉపఎన్నికల విషయంలో యాక్టివ్ కాని కోమటిరెడ్డి 


పార్టీ ఆదేశిస్తే ప్రచారం చేస్తానన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికీపూర్తి స్థాయిలో ముందుకు రావడం లేదు. మునుగోడు ఉపఎన్నికపై జరిగే సమావేశాలకు రావడం లేదు. పైగా అక్కడ సోదరుడి కోసం పని చేయాలని కాంగ్రెస్ నేతలకు ఫోన్లు చేస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో కోమటిరెడ్డి ఇష్యూ కూడా మునుగోడు ఉపఎన్నికల్లో కీలకం కానుంది. సోదరుడి ఓటమి కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి పని చేస్తే కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుందని..  ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు. ఆయన విషయంలో కాంగ్రెస్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేకపోతోంది.