కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) నాలుగుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధించడంతోపాటు ఒక సారి ఎంపీగా గెలిచి అటు నల్గొండ రాజకీయాల్లోనూ.. ఇటు తెలంగాణ రాజకీయాల్లోనూ కీలక నేతగా ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో వెంకటరెడ్డికి ప్రత్యేకమైన క్యాడర్‌ ఉంది. ఆయన సోదరుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రాజగోపాల్‌రెడ్డికి అంతగా పట్టులేదనే చెప్పవచ్చు. వెంకటరెడ్డి బ్రాండ్‌పైనే రాజగోపాల్‌రెడ్డి రాజకీయాల్లో ఎదిగారు. నల్గొండ ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఆ తర్వాత మనుగోడు ఎమ్మెల్యేగా రాజగోపాల్‌రెడ్డి విజయం సాధించేందుకు వెంకటరెడ్డి క్యాడరే ప్రధాన కారణమని ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రాజకీయ నాయకులు చెబుతుంటారు. ఈ క్రమంలో రాజగోపాల్‌రెడ్డికంటే మునుగోడులో వెంకటరెడ్డికే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఇదే విషయాన్ని గమనించిన కాంగ్రెస్‌ అధిష్టానం సైతం వెంకటరెడ్డి చెప్పిన పేరునే ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 
గెలుపు బాధ్యతలన్నీ వెంకటరెడ్డికే..?
మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఆయన సోదరుడు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై సొంత పార్టీ నేతలు విమర్శలు చేశారు. దీంతోపాటు చండూరులో చేపట్టిన సభకు ఆయనకు ఆహ్వానం లేదనే కారణంతో ఆయన కాంగ్రెస్‌ నేతలపై విరుచుకుపడ్డారు. ఈ విషయాన్ని గమనించిన కాంగ్రెస్‌ అధిష్టానం వెంకటరెడ్డితో ప్రత్యేకంగా చర్చలు జరిపింది. స్వయంగా ప్రియాంకా గాంధీ రంగంలోకి దిగి వెంకటరెడ్డితో చర్చలు జరిపింది. ఈ చర్చల తర్వాత ఆయన కొంత సైలెంట్‌ అయ్యారు. మునుగోడు అభ్యర్థిత్వం కోసం ప్రధానంగా పాల్వాయి స్రవంతితోపాటు చల్లమల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్‌లు పోటీ పడ్డారు. అయితే వీరిలో పాల్వాయి స్రవంతి అభ్యర్థిత్వాన్ని మిగిలిన నాయకులతోపాటు వెంకటరెడ్డి బలపరిచినట్లు తెలుస్తోంది.


మునుగోడు నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన పాల్వాయి గోవర్థన్‌రెడ్డి వారసురాలు పాల్వాయి స్రవంతి. 2014లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన పాల్వాయి స్రవంతి ఆ తర్వాత 2018లో రాజగోపాల్‌రెడ్డికి టిక్కెట్‌ కేటాయించినప్పటికీ ఆమె కాంగ్రెస్‌ పార్టీ విజయం కోసం పనిచేసింది. పార్టీకి విధేయురాలిగా ఉండటం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా స్రవంతి అభ్యర్థిత్వంపై సిపారసు చేయడంతో కాంగ్రెస్‌ పార్టీ ఆమెకు టిక్కెట్‌ కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భువనగిరి ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీ నియోజకవర్గంలోనే మునుగోడు ఉండటం, మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి కంటే వెంకటరెడ్డికే ఈ నియోజకవర్గంలో ఎక్కువ పట్టు ఉంది. ఇప్పుడు వెంకటరెడ్డి ఎవరి కోసం పనిచేస్తారనే విషయంపై చర్చ సాగుతోంది. మరోవైపు కాంగ్రెస్‌ అధిష్టానం సైతం ఈ నియోజకవర్గంలో గెలుపు బాద్యతలను వెంకటరెడ్డికే అప్పగించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీని గెలిపించడం ద్వారా సొంత పార్టీలో పై మెట్టు ఎక్కుతారా..? లేక సోదరుడి కోసం కష్టపడతారా..? అనేది చర్చానీయాంశంగా మారింది. 


ఇటీవల కాలంలో మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్‌రెడ్డి గెలుపు కోసం పనిచేయాలని కొంత మంది కాంగ్రెస్‌ కార్యకర్తలకు వెంకటరెడ్డి చెప్పినట్లు విమర్శలు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. మునుగోడు ఉప ఎన్నికల కోసం నేరుగా ప్రియాంకా గాంధీ రంగంలోకి దిగడం, ఆమె కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ప్రత్యేకంగా చర్చలు జరపడంతో ఇప్పుడు వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి కోసం పనిచేస్తారా.. లేక సొంత పార్టీ కోసం పనిచేస్తారా అనేది నియోజకవర్గంతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.