Britain New King:
లండన్‌లో సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో జరిగిన అక్సెషన్ కౌన్సిల్‌లో (Accession Council) కింగ్ ఛార్లెస్ -IIIను కొత్త మోనార్కీగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో క్వీన్ కన్సోర్ట్ క్యామిల్లా, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ విలియం, ప్రధాని లిజ్ ట్రస్‌తో సహా మరికొందరు హాజరయ్యారు. అక్సెషన్ కౌన్సిల్ సమక్షాన ఛార్లెస్‌కు రాచరికపు అధికారాలను అప్పగించారు. ఈ బాధ్యతలు చేపడుతున్నట్టుగా సంతకాలు కూడా చేశారు ప్రిన్స్ ఛార్లెస్. సంతకాలు చేసిన వెంటనే ఆయన ఓ కీలక ప్రకటన చేశారు. తన విధులు, బాధ్యతల పట్ల పూర్తి అవగాహనతో ఉన్నానని వెల్లడించారు. 300 ఏళ్లకు పైగా రాచరికపు బాధ్యతలు చేపట్టే ప్రక్రియను బయట ప్రజలకు తెలియకుండా ఎంతో అధికారికంగా చేసేవారు. ఇప్పుడు తొలిసారి ప్రజల సమక్షంలో ఈ ప్రక్రియ నిర్వహించారు. ఈ ప్రాసెస్‌ను లైవ్ కూడా ఇచ్చారు. అక్కడి ప్రజలంతా "God Save the King" అంటూ ప్రమాణం చేశారు. హిప్ హిపు హుర్రే అంటూ మూడు సార్లు గట్టిగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కింగ్ ఛార్లెస్ భావోద్వేగంగా మాట్లాడారు. "డార్లింగ్ మామా" అంటూ తన తల్లిని గుర్తు చేసుకున్నారు. "ఆమె మరణం నన్ను శోకంలోకి నెట్టేసింది. ఆమె లేని లోటు తీర్చలేనిది. ఆమె పంచిన ప్రేమ మాకు ఎన్నో విషయాల్లో మార్గదర్శకంగా నిలిచింది. 21 ఏళ్ల వయసులోనే తన జీవితాన్ని దేశానికి అంకితం చేస్తున్నట్టు ప్రతిజ్ఞ చేశారు. అది కేవలం ప్రతిజ్ఞగా మిగిలిపోలేదు. ఆమె ఎంతో నిబద్ధతగా దాన్ని నెరవేర్చారు. ఇందుకోసం ఆమె ఎన్నో త్యాగాలు చేశారు. ఇప్పుడామె వెళ్లిపోయాక వారసత్వాన్ని కొనసాగించే బాధ్యత నాకు దక్కింది. ఈ బాధ్యత నా జీవితంలో ఎన్నో మార్పులకు కారణమవుతుందని తెలిసినా...ఆమె ఆశయానికి అనుగుణంగా నా జీవితాన్ని కూడా దేశానికి అంకితం చేస్తానని మాటిస్తున్నాను. ఈ సందర్భంగా నా తల్లికి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా...థాంక్యూ" అని చాలా ఎమోషనల్ అయ్యారు ప్రిన్స్ ఛార్లెస్.