Politics on Ram Mandir:
వివాదాస్పద వ్యాఖ్యలు..
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, వివాదాస్పద నేత శంకర్ సిన్హ్ వగేలా రామ్ మందిర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. "రామ మందిరం పేరు చెప్పుకుని బీజేపీ మార్కెటింగ్ చేసుకుంటుంది. పేదవాళ్లకు ఆహారం, ఉద్యోగం దొరుకుతుందో లేదోనన్న పట్టింపెక్కడుంది" అని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. దేవుడిని అవమానించారంటూ మండి పడింది. బీజేపీనే కాదు. ఆప్‌ను కూడా విమర్శించారు..శంకర్ సిన్హ్. "అరవింద్ కేజ్రీవాల్ ఎప్పటికీ రాజకీయ నేత కాలేరు. ఓ IAS,IPS అధికారి మంచి లీడర్ ఎలా అవుతాడు. కేజ్రీవాల్ సంఘ్ మనిషి. బీజేపీ కోసమే పని చేస్తాడు. RSS ఎప్పుడో బీజేపీలో విలీనమైపోయింది. సొంతగా ఆలోచించే స్వేచ్ఛ కోల్పోయింది" అని అన్నారు. 1996-97 మధ్య కాలంలో శంకర్ సిన్హ్ వగేలా గుజరాత్ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. 1977లో తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు.
2024 జనవరిలో రామ మందిరం..
భాజపా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే 50% పనులు పూర్తైనట్టు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. 2024 జనవరిలో మకర సంక్రాంతి రోజున ఆలయాన్ని ప్రారంభించనున్నట్టు స్పష్టం చేసింది. రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించి...భక్తుల సందర్శనార్థం ఆలయాన్ని తెరవనున్నట్టు తెలిపింది. రామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ (Ram Janmabhoomi Teerth Kshetra Trust)జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ ఇందుకు సంబంధించి మరి కొన్ని వివరాలు వెల్లడించారు.
"మరో వెయ్యేళ్ల పాటు ఈ ఆలయం నిలిచిపోతుంది. భూకంపాలు వచ్చినా తట్టుకుని నిలబడుతుంది" అని స్పష్టం చేశారు. మొత్తం 1800 ఎకరాల్లో ఆలయ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఆలయానికి 392 స్తంభాలు, 12 ద్వారాలు ఉంటాయి. ఐరన్ రాడ్స్ వినియో గించకుండానే...వీటి నిర్మాణం కొనసాగుతోంది. రాళ్లను అనుసంధానించటానికి ఐరన్ రాడ్స్ బదులుగా...కాపర్ చిప్స్‌ను వినియోగిస్తున్నారు.
గర్భగుడిలో 160 స్తంభాలుంటాయి. మొదటి అంతస్తులోనే 82 పిల్లర్స్ ఉంటాయని ట్రస్ట్ తెలిపింది. మొత్తం 12 ప్రవేశ ద్వారాలు అందుబాటు లోకి వస్తాయి. 2023 డిసెంబర్‌లోగా ఆలయ గర్భగుడి పనులు పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. 2024లోగా ఆలయ నిర్మాణం, 2025లోగా ఆలయ సముదాయంలోని ఇతర నిర్మాణాలు పూర్తవుతాయని రామమందిరం నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా అన్నారు. అయోధ్యలో రామాలయం నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ 2019లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 2020 ఆగస్టు 5న అయోధ్య రామ మందిర నిర్మాణం లాంఛనంగా ప్రారంభమైంది.
ప్రత్యేకతలు
1. 2.7 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన ఆలయాన్ని నిర్మిస్తున్నారు.
2. మందిరం పొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులు ఉంటుంది.
3. మూడు అంతస్తులతో నిర్మించనున్న ఈ మందిరం ఎత్తు 161 అడుగులు ఉంటుంది.
4. రెండున్నర అడుగుల పొడవు ఉన్న 17 వేల రాళ్లను మందిరం నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు.
5. రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలోని బన్సీ పహార్‌పూర్‌లోని ఇసుకరాళ్లను ఆలయ ప్రధాన నిర్మాణం కోసం ఉపయోగించనున్నారు.