Assam-Meghalaya Border:


ఇంకా చల్లారని ఉద్రిక్తతలు..


ఇటీవల అసోం, మేఘాలయ సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ గొడవలో ఆరుగురు మృతి చెందారు. అప్పటి నుంచి రెండు రాష్ట్రాల్లోనూ అలజడి రేగింది. తప్పు మీదంటే మీదంటూ రెండు రాష్ట్రాలూ ఆరోపణలు చేసుకుంటున్నాయి. అక్కడక్కడా నిరసనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అసోం ప్రభుత్వం ప్రజలకు పలు సూచనలు చేసింది. "బయట పరిస్థితులేమీ బాలేవు" అని వెల్లడించింది. 
మేఘాలయాకు వెళ్లాల్సిన వాళ్లు ఆ ప్రయాణాన్ని మానుకోవాలని సూచించింది. అసోం నుంచి మేఘాలయకు వెళ్లాల్సిన నిత్యావసరాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇంధన రవాణా కూడా ఆగిపోయింది. వాహనాలపై దాడులు జరిగిన నేపథ్యంలో...ప్రతి వెహికిల్‌ని చెక్ చేస్తున్నారు. దాడులు జరిగిన వెస్ట్ కర్బి ప్రాంతంలో ఇంకా అలజడి చల్లారలేదు. భద్రతా బలగాలు అక్కడికి చేరుకుని పహారా కాస్తున్నారు. ఈ ప్రాంతమంతటా 144 సెక్షన్ కూడా అమలు చేశారు. "నిన్న షిల్లాంగ్‌లో కొందరు పోలీసుల వాహనాలకు నిప్పు పెట్టారు. పరిస్థితులేమీ బాలేవు. అందుకే...ప్రజలెవరూ మేఘాలయాకు వెళ్లొద్దని సూచిస్తున్నాం. ముఖ్యంగా అసోం ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి" అని గువాహటి డిప్యుటీ కమిషనర్ వెల్లడించారు. అసోం వాళ్లు కాకుండా వేరే ప్రాంత ప్రజలు మేఘాలయాలోకి వెళ్లాల్సి వస్తే అసోం నంబర్ ప్లేట్‌ లేని వాహనాల్లో వెళ్లాలని సూచిస్తున్నారు. ఇప్పటికే మేఘాలయకు వెళ్లి అక్కడ చిక్కుకున్న వాళ్లను అసోంకు రప్పించేందుకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు తెలిపారు.  


ఇదీ జరిగింది..


అసోం, మేఘాలయా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.  అక్రమంగా కలప తరలిస్తున్న ట్రక్ విషయంలో తలెత్తిన గొడవ.. చినికిచినికి గాలివానైంది. అస్సాం ఫారెస్ట్ గార్డ్స్ ఆ ట్రక్‌ను అడ్డుకోగా...ఘర్షణ మొదలైంది. ఈ దాడిలో మేఘాలయకు చెందిన ఐదుగురు గిరిజనులతో పాటు ఓ అస్సాం ఫారెస్ట్ గార్డ్ కూడా మృతి చెందాడు. ఇది జరిగిన వెంటనే...మేఘాలయాలోని గిరిజన గ్రామ ప్రజలు అస్సాంలోని వెస్ట్ కర్బి అంగలాంగ్ జిల్లాలో ఫారెస్ట్ ఆఫీస్‌పై దాడి చేసి ధ్వంసం చేశారు. ఈ రెండు ఘటనలతో...మరోసారి అస్సాం, మేఘాలయా మధ్య వైరం భగ్గుమంది. పలు చోట్ల వాహనాలకు నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నట్టుండి ఈ స్థాయిలో ఘర్షణ ఎందుకు జరిగిందన్నది తెలియాల్సి ఉంది. మేఘాలయా సీఎం కొన్రాడ్ సంగ్మా అస్సాం పోలీసులు, ఫారెస్ట్ గార్డ్‌లదే తప్పు అని ఆరోపి స్తున్నారు. "వాళ్లే కావాలని మా వైపు వచ్చి కాల్పులు జరిపారు" అని చెబుతున్నారు. అంతే కాదు. ట్విటర్ వేదికగా...ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్‌షాలను ట్యాగ్ చేస్తూ పోస్ట్‌లు చేశారు. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని మేఘాలయా మంత్రులు డిమాండ్ చేస్తున్నారు. అమిత్‌షాను కలిసి ఈ ఘటనలపై చర్చించనున్నారు.  అటు అస్సాం ప్రభుత్వం కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలకే విచారణను అప్పగిస్తామని ప్రకటించింది. 


Also Read: Liquor Policy Case : ఎఫ్ఐర్‌లో ఏ-1 సిసోడియా - చార్జిషీటులో మాత్రం మిస్ ! ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం