Rajasthan Congress Crisis:


నా దృష్టంతా ఎన్నికలపైనే: పైలట్


రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోట్ తనపై చేసిన వ్యాఖ్యలపై సచిన్ పైలట్ స్పందించారు. భాషను అదుపులో పెట్టుకుంటే మంచిదని వార్నింగ్ ఇచ్చారు. "కాస్త భాషను అదుపులో పెట్టుకోండి. అంత పెద్ద లీడర్ అయిన మీరు అలాంటి భాష వాడతారా" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. "గహ్లోట్ నన్ను మోసగాడు మోసగాడు అంటే పదేపదే సంబోధించారు. ఇలాంటి వాటి వల్ల ఆయన సాధించేదేమీలేదు" అని తేల్చి చెప్పారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌ను బలపరిచి..బీజేపీని ఢీకొట్టడంపైనే పూర్తి స్థాయిలో దృష్టి సారించానని స్పష్టం చేశారు సచిన్ పైలట్. కాంగ్రెస్ అధిష్ఠానం గహ్లోట్‌కు సముచిత స్థానం ఇచ్చిందని, అది మరిచిపోయి ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీపై చేసే పోరాటంలో అందరం కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఎన్నో రోజులుగా గహ్లోట్ తనపై ఆరోపణలు చేస్తున్నా..తాను పట్టించుకోవడం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం పార్టీ దృష్టంతా గుజరాత్ ఎన్నికలపైనే ఉందని వెల్లడించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీతో కలిసి నడిచారు పైలట్. "కలిసికట్టుగా బీజేపీని ఓడించడానికి ఇదే సరైన సమయం. ఇది కేవలం కాంగ్రెస్ వల్లే సాధ్యమవుతుంది" తెలిపారు. అయితే..రాజస్థాన్‌లో భారత్ జోడో యాత్ర నిర్వహించాలంటే.. పైలట్‌ను ముఖ్యమంత్రిగా అంగీకరించాల్సిందేనని కొందరు నేతలు డిమాండ్ చేశారు. కానీ...ఆ తరవాత అందరూ సైలెంట్ అయిపోయారు. ఈ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా పైలట్ సమీక్షించారు. ఇది చరిత్రాత్మకంగా నిలిచిపోవాలని భావిస్తున్నట్టు చెప్పారుకూడా. 


పైలట్‌పై గహ్లోట్ కామెంట్స్..


ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోట్..సచిన్‌ పైలట్‌పై విరుచుకు పడ్డారు. "మోసగాడు" అంటూ పదేపదే పైలట్‌ను ఉద్దేశిస్తూ తీవ్రంగా మండి పడ్డారు. "ఓ మోసగాడు ఎప్పటికీ ముఖ్యమంత్రి అవ్వలేడు" అని నిప్పులు చెరిగారు. "పార్టీ అధిష్ఠానం సచిన్ పైలట్‌ను సీఎం చేయలేదు. ఆయనకు కనీసం 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడా లేదు. ఆయన పార్టీకి నమ్మకద్రోహం చేశారు. అతనో మోసగాడు" అని విమర్శించారు. ఓ పార్టీ అధ్యక్షుడే తమ ప్రభుత్వాన్ని కుప్ప కూల్చేందుకు ప్రయత్నించడం దేశ రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2020లో సచిన్ పైలట్...సీఎం పదవి కోసం గహ్లోట్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించారు. ఆ అంశాన్నే ప్రస్తావిస్తూ గహ్లోట్ అసహనం వ్యక్తం చేశారు. దీనంతటికీ కారణం బీజేపీయేనని ఆరోపించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సహా పలువురు బీజేపీ పెద్దలు ఈ కుట్ర వెనక ఉన్నారని అన్నారు. "అమిత్‌షా, ధర్మేంద్ర ప్రదాన్ ఈ కుట్రలో చేతులు కలిపారు. పైలట్‌తో కలిసి ఢిల్లీలో ఓ సారి మీటింగ్ కూడా పెట్టుకున్నారు" అని చెప్పారు గహ్లోట్. పైలట్ వైపు మళ్లేందుకు ఒక్కో ఎమ్మెల్యేకూ ఢిల్లీ ఆఫీస్‌లో రూ.10 కోట్లు ఇచ్చారని, మరి కొందరికి రూ.5 కోట్లు ముట్టజెప్పారని ఆరోపించారు. గాంధీ కుటుంబం వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని స్పష్టం చేశారు.


Also Read: Kejriwal Fires on BJP: ఒక్కరోజు సీబీఐ, ఈడీలను నాకు అప్పగించండి, సగం బీజేపీ జైల్లోనే ఉంటుంది - కేజ్రీవాల్