Gujarat Polls: గుజరాత్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో 21 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) గురువారం తెలిపింది. గుజరాత్‌లో మార్పు రావాలని నినదిస్తోన్న ఆప్ అభ్యర్థులపైనే ఎక్కువ కేసులు ఉండటం మరో ట్విస్ట్.
ఇలా
ఈ జాబితాలో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్‌ఆద్మీ పార్టీ అగ్రస్థానంలో ఉండగా ఆ తర్వాత కాంగ్రెస్, భాజపా ఉన్నాయి. తొలి విడత ఎన్నికల్లో పోలింగ్ జరగనున్న 89 స్థానాల కోసం 788 మంది బరిలో ఉన్నారు. ఇందులో 167 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. వీరిలో 100 మంది హత్య, అత్యాచారం వంటి తీవ్ర నేరారోపణలను ఎదుర్కొంటున్నట్లు నివేదికలో తేలింది.
కోటీశ్వరులు
బరిలో ఉన్న 788 మందిలో 211 మంది కోట్లకు పడగలెత్తిన వారు ఉన్నారు. ఇందులో అత్యధికంగా భాజపాకు చెందిన 79 మంది ఉన్నారని ఏడీఆర్ తెలిపింది. రాజ్‌కోట్ సౌత్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న భాజపా అభ్యర్థి రమేశ్ తిలాలా రూ.175 కోట్ల ప్రకటిత ఆస్తులతో అత్యంత ధనికుడిగా ఉన్నారు. రాజ్‌కోట్ వెస్ట్ నుంచి బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థి భూపేంద్ర పటోలియా ఎటువంటి ఆస్తులు లేవంటూ ఎన్నికల అఫిడవిట్‌లో తెలిపారు.
ఎన్నికల షెడ్యూల్
ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించింది. గుజరాత్‌లోని మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు జరపనున్నట్లు ఈసీ ప్రకటించింది. గుజరాత్ శాసనసభ పదవీకాలం 2023, ఫిబ్రవరి 18తో ముగియనుంది.
డిసెంబర్ 1న గుజరాత్ తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 5న రెండో విడత పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న కౌంటింగ్, ఫలితాలు వెల్లడించనుంది.
2017లో
గుజరాత్‌లో ప్రస్తుతం భాజపా ప్రభుత్వం అధికారంలో ఉంది. గుజరాత్‌లో 182 శాసనసభ స్థానాలుండగా.. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి 99 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 77 స్థానాలు సాధించింది. ఆ తర్వాత రాష్ట్రంలో పలుమార్లు ఉప ఎన్నికలు జరగడంతో ప్రస్తుతం కాషాయ పార్టీ బలం 111కు పెరిగింది.