Kejriwal Fires on BJP:
బీజేపీపై ఫైర్..
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది బీజేపీ, ఆప్ మధ్య విమర్శలు పెరుగుతూ పోతున్నాయి. దాదాపు 15 ఏళ్లుగా ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తూ వస్తోంది బీజేపీ. ఈ సారి మాత్రం ఆప్ గట్టి పోటీ ఇస్తోంది. ఇప్పటికే ఆ పార్టీని సీబీఐ, ఈడీ సోదాలతో చుట్టుముట్టింది. అయినా...ఆప్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. బీజేపీ గెలిచే అవకాశాలే లేవని ప్రచారం చేస్తోంది. తమపై అక్రమ కేసులు పెడుతూ, ఆరోపణలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తోందని బీజేపీపై మండి పడుతోంది. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. "ఒక్కరోజు సీబీఐ, ఈడీని నాకు అప్పగించండి. బీజేపీలోని సగం మంది జైల్లోనే ఉంటారు" అని అన్నారు. సత్యేంద్ర జైన్ గురించి ప్రస్తావన వచ్చిన సమయంలో ఈ కామెంట్స్
చేశారు కేజ్రీవాల్. అంతే కాదు. బీజేపీపై అవినీతి ఆరోపణలు కూడా చేశారు. "గత ఐదేళ్లుగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు అభివృద్ధి నిధుల కింద రూ.లక్ష కోట్లు అందాయి. కానీ...బీజేపీ నేతలు ఆ డబ్బునంతా తినేశారు. అందులో కొంత మొత్తమైనా ఖర్చు పెట్టి ఉంటే కనీసం ఉద్యోగులకు సరైన సమయానికి జీతాలైనా అందేవి" అని మండి పడ్డారు. "దర్యాప్తు సంస్థలు వాళ్ల చేతుల్లో ఉన్నాయి. మాకు వ్యతిరేకంగా ఎన్నో కేసులు పెట్టారు. సత్యేంద్ర జైన్, మనీశ్ సిసోడియా అవినీతి పరులని ముద్ర వేశారు. మనీశ్ సిసోడియా రూ.10 కోట్ల లిక్కర్ స్కామ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. అన్నిసార్లు సోదాలు చేసినా ఏమీ దొరకలేదు. ఆ పది కోట్లు ఎటు పోయాయి..?" అని ప్రశ్నించారు. గుజరాత్‌లో మోర్బి వంతెన కూలిన ఘటననూ ప్రస్తావించారు కేజ్రీవాల్. బీజేపీ అవినీతి వల్లే ఆ ప్రమాదం జరిగిందని విమర్శించారు.
కేజ్రీవాల్‌పై కేంద్రమంత్రి విమర్శలు..
కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి ఆప్‌పై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. "ఆప్ పాపాలన్నీ కడిగితే నర్మదా నది కూడా కలుషితమై పోతుంది" అని విమర్శించారు. తీహార్ జైల్లో ఉన్న ఆప్ నేత సత్యేందర్ జైన్‌ను ఇప్పటి వరకూ మంత్రి పదవిలో నుంచి తొలగించలేదని మండి పడ్డారు. పైగా...మసాజింగ్ నుంచి ప్యాక్డ్ ఫుడ్ అందించడం వరకూ సకల మర్యాదలూ లభిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్ని మభ్యపెట్టడమే ఆప్ పని అని అన్నారు. "సత్యేందర్ జైన్ జైల్లో ఉన్నా ఆయన మర్యాదలకు తక్కువేమీ జరగడం లేదు. మంత్రి పదవి నుంచీ తొలగించలేదు. పోక్సో చట్టం కింద అరెస్టైన వ్యక్తితో సత్యేందర్ జైన్ సన్నిహితంగా ఉంటున్నారు. ఇలాంటి వ్యక్తుల వల్లే రాజకీయాలకు మచ్చ వస్తోంది. ఆమ్‌ఆద్మీ పార్టీ మోసం చేయడం తప్ప మరింకేదీ చేయలేదు. ఎక్సైజ్ స్కామ్, క్లాస్‌రూమ్ స్కామ్ లాంటి కుంభకోణాలకు పాల్పడ్డారు" అని నిప్పులు చెరిగారు..కేంద్రమంత్రి మీనాక్షి లేఖి.
Also Read: Manish Sisodia on BJP: 'కేజ్రీవాల్ హత్యకు భాజపా కుట్ర'- సిసోడియా సంచలన వ్యాఖ్యలు