Manish Sisodia on BJP: దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమ్‌ఆద్మీ జాతీయ కన్వీనర్, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను చంపేందుకు భాజపా కుట్ర పన్నుతుందని సిసోడియా అన్నారు. కేజ్రీవాల్‌పై భాజపా ఎంపీ మనోజ్ తివారీ వాడిన భాష చూస్తే ఇదే నిజమనిపిస్తుందని సిసోదియా పేర్కొన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ఈ విషయంలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తుందని సిసోడియా చెప్పారు. గుజరాత్, ఎంసీడీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు.
మనోజ్ తివారీ.. కేజ్రీవాల్‌ను బెదిరించారు. ఇది చూస్తుంటే భాజపా (దిల్లీ సీఎం) అరవింద్ కేజ్రీవాల్ హత్యకు కుట్ర చేస్తోందని స్పష్టంగా తెలుస్తోంది. ఈ విషయంపై ఎన్నికల కమిషన్‌లో ఫిర్యాదు చేస్తాం. ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేస్తాం - మనీశ్ సిసోడియా, దిల్లీ డిప్యూటీ సీఎం
ఖండించిన తివారీ
తనపై సిసోడియా చేసిన ఆరోపణలను భాజపా ఎంపీ మనోజ్ తివారీ ఖండించారు. కేజ్రీవాల్ భద్రత గురించి మాత్రమే తాను ఆందోళన వ్యక్తం చేశానన్నారు.
నేను కేజ్రీవాల్ భద్రత గురించి మాత్రమే నా ఆందోళనను వ్యక్తం చేశాను. ఆప్ ఎమ్మెల్యేలపై దాడి జరుగుతోంది. ఆ పార్టీ కార్యకర్త ఒకరు మరణించారు. ఈ పరిస్థితి నాకు ఆందోళన కలిగిస్తుంది. ఆమ్‌ఆద్మీ చేసిన ఈ హత్య బెదిరింపుల స్క్రిప్ట్ పాతదే. ఏడాది క్రితమే వాళ్లు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. సంవత్సరం మారింది.. కానీ వాళ్ల ఆరోపణలు అలాగే ఉన్నాయి. - మనోజ్ తివారీ, భాజపా ఎంపీ
Also Read: Malaysia New PM: మలేసియాలో మహోదయం- నూతన ప్రధానిగా సంస్కరణవాది అన్వర్